Begin typing your search above and press return to search.

మోజో టీవీ స్టూడియోలో సీఈవో దీక్ష‌.. హైడ్రామా!

By:  Tupaki Desk   |   23 May 2019 3:51 AM GMT
మోజో టీవీ స్టూడియోలో సీఈవో దీక్ష‌.. హైడ్రామా!
X
ఓప‌క్క టీవీ9 ఛాన‌ల్ కు సంబంధించి మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ వ‌ర్సెస్.. కొత్త మేనేజ్ మెంట్ అయిన మైహోం రామేశ్వ‌ర‌రావు అండ్ కోల మ‌ధ్య వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మైహోం రామేశ్వ‌ర‌రావు పైన ర‌విప్ర‌కాశ్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ.. తాను చేసే పోరాటానికి అంద‌రూ త‌న‌కు స‌పోర్ట్ చేయాల‌ని ర‌విప్ర‌కాశ్ వీడియో సందేశాన్ని పంప‌టం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా.. ర‌విప్ర‌కాశ్ కు చెందిన మ‌రో టీవీ ఛాన‌ల్ మోజో టీవీలో బుధ‌వారం రాత్రి అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌మ టీవీ చాన‌ల్ ను క‌బ్జా చేసేందుకు హైహోం రామేశ్వ‌ర‌రావు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఆరోపిస్తూ మోజో టీవీ సీఈవో రేవ‌తి స‌ద‌రు ఛాన‌ల్ స్టూడియోలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగి సంచ‌ల‌నం సృష్టించారు. ఒక టీవీ ఛాన‌ల్ స్టూడియోలో ఒక సీఈవో ఈ త‌ర‌హాలో దీక్ష‌లో కూర్చోవ‌టం ఒక్క‌సారిగా వార్తా మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సంద‌ర్భంగా టీవీ9 కొత్త మేనేజ్ మెంట్ లో కీల‌క‌మైన మైహోం రామేశ్వ‌ర‌రావుపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ టీవీ ఛాన‌ల్ ను క‌బ్జా చేసేందుకు మైహోం రామేశ్వ‌ర్ రావు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఈ ఛాన‌ల్ ను అక్ర‌మ ప‌ద్ద‌తిలో కొనేసేందుకు ఆయ‌న సిద్ద‌మ‌వుతున్న‌ట్లుగా ఆరోపణ‌లు చేశారు.

ఇదిలా ఉంటే.. రేవ‌తి దీక్ష వెనుక కార‌ణం వేరుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మోజో టీవీ ఛైర్మ‌న్ హ‌రికిర‌ణ్ చేరెడ్డి పేరిట ఉంది. టీవీ9 లోగోను మోజో టీవీకి రూ.99వేల‌కు ర‌విప్ర‌కాశ్ అమ్మిన ఉదంతం తెలిసిందే. ఈ ఇష్యూకు సంబంధించి రేవ‌తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. త‌మ‌పై కేసులు పెట్టాల‌న్న ఉద్దేశంతో పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు.

దీంతో పోలీసు వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. మ‌రోవైపు బుధ‌వారం రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో మోజో టీవీ శాటిలైట్ సిగ్న‌ల్ క‌ట్ కావ‌టంతో ప్ర‌సారాలు ఆగిపోయాయి. అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత మోజో టీవీ ఛాన‌ల్ ఛైర్మ‌న్ హ‌రికిర‌ణ్ స్టూడియో వ‌ద్ద‌కు వ‌చ్చారు. త‌మ సీఈవో రేవ‌తి దీక్ష చేయ‌టం లేద‌ని ప్ర‌క‌టించారు. పోలీసులు త‌న‌ను సంప్ర‌దించార‌ని.. త‌మ సీఈవో ఎలాంటి దీక్ష చేయ‌టం లేద‌న్న విష‌యాన్ని పోలీసులకు చెప్పిన‌ట్లుగా తెలిపారు. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ తో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. ప్ర‌స్తుతం ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని ఆయ‌న పేర్కొన‌టం గ‌మ‌నార్హం.