Begin typing your search above and press return to search.

బాబును తిట్టొచ్చు కానీ ఇలా తిడితే దెబ్బే జానీ!

By:  Tupaki Desk   |   18 April 2019 11:21 AM GMT
బాబును తిట్టొచ్చు కానీ ఇలా తిడితే దెబ్బే జానీ!
X
రాజకీయాల్లో తిట్టటం.. తిట్టించుకోవ‌టం రెండూ మామూలే. అయితే.. అవి రెండు హ‌ద్దుల్లో ఉండాలి. గీత దాటిన వాటి విష‌యంలో ప్ర‌జ‌లు రియాక్ట్ అయ్యే తీరుతో జ‌రిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు.. ఎన్నిక‌ల త‌ర్వాత వ్యాఖ్య‌ల తీవ్ర‌త‌ను పెంచుతున్నారు. వెనుకా ముందు చూసుకోకుండా అనేస్తున్నారు.

గెలుపు ధీమా కావొచ్చు.. అధికారం త‌మ‌దే అన్న ఉత్సాహంలోనూ ఈ త‌ర‌హా హ‌డావుడి మామూలే. కాకుంటే.. అధికారం చేతికి వ‌చ్చిన‌ప్పుడు అధికార‌ప‌క్షం మ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించటాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారు. అంతేకానీ.. ఓడిన వారిని ఇష్టారాజ్యంగా మాట‌లు అనేయ‌టాన్ని ఒప్పుకోరు. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏమిట‌న్న దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో.. జ‌గ‌న్ పార్టీ నేత‌లు బాబును ఉద్దేశించి చేస్తున్న కొన్ని వ్యాఖ్య‌లు స‌రి కావ‌న్న మాట వినిపిస్తోంది.

ఓట‌ర్ల ట్రెండ్ చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాదిరి హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. పోలింగ్ నాటి నుంచి నేటి వ‌ర‌కూ జ‌గ‌న్ ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే త‌ప్పించి.. ఎక్క‌డా మాట‌ల హ‌డావుడి చేయ‌టం లేదు. కూల్ గా తుది ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు.

పోలింగ్ రోజు నుంచి బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌జామోదం లేక‌నే బాబు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ ఉంది. ఒక‌వేళ‌.. అంద‌రి అంచ‌నాలు నిజ‌మై బాబు ఓట‌మి ఖ‌రారైన ప‌క్షంలో.. జ‌గ‌న్ పార్టీ నేత‌లు త‌మ అధినేత బాట‌లో న‌డుస్తూ హుందాగా వ్య‌వ‌హ‌రించాలే కానీ నోరు పారేసుకోకూడ‌దు.

అందుకు భిన్నంగా తాజాగా జ‌గ‌న్ పార్టీ నేత మ‌హమ్మ‌ద్ జానీ మాట్లాడుతూ.. బాబు మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ వ్యాపారుల‌తో క‌లిసి గుడ్డి ప‌త్తి అమ్ముకున్న మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు టీడీపీకి 150 సీట్లు వ‌స్తాయ‌ని జోస్యం చెప్ప‌టాన్ని కామెడీగా అభివ‌ర్ణించారు. ఈ మాట‌లో అభ్యంత‌రం లేకున్నా.. ఎండ‌ల్లో తిరిగి బాబు మైండ్ పోయిందేమో? డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకో అంటూ చేసిన వ్యాఖ్య‌లు స‌రికావ‌న్న మాట వినిపిస్తోంది. చంద్ర‌బాబు నుంచి.. టీడీపీ నేత‌ల వ‌ర‌కూ ఎవ‌రిని ఉద్దేశించి ఇలాంటి మాట‌లు అన‌టం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో అహంకారం ఎక్కువైంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయ‌మంటున్నారు. విజ‌యం వ‌రించే వేళ.. ఒద్దిక‌గా ఉంటే ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని మ‌రింత‌గా దోచుకోవ‌చ్చ‌న్న విష‌యాన్ని జానీ లాంటి నేత‌లు గుర్తిస్తే మంచిది.