Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు!

By:  Tupaki Desk   |   24 March 2019 9:50 AM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు!
X
నటుడు మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పొలిటీషియన్ గా రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన మోహన్ బాబు… ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా సమాచారం. ఎన్నికల వేళ మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఆసక్తిదాయకంగా ఉంది.

గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతూ ఉన్నారు. ప్రత్యేకించి కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను చెల్లించకపోవడం పై ఆయన నిరసనకు కూడా దిగారు. తిరుపతిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే మోహన్ బాబుపై ఏపీ ప్రభుత్వంలోని వ్యక్తులు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడం గురించి కాకుండా.. మోహన్ బాబు విద్యా వ్యాపారం చేస్తున్నాడా అంటూ వారు మాట్లాడుతున్నారు.

వారిపై మోహన్ బాబు తనయులు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అది అలా సాగుతూ ఉండగానే.. మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడానికి నిర్ణయించుకున్నారట కలెక్షన్ కింగ్.

ప్రస్తుతానికి తనకేం అవసరం లేదని.. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్య సభ సభ్యత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాడట మోహన్ బాబు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పుడు మోహన్ బాబు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మోహన్ బాబు రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో చూడాలి!