మంచు లక్ష్మికి వైసీపీ టిక్కెట్?

Mon Mar 20 2017 15:43:01 GMT+0530 (IST)

తెలుగును ముక్కలుచెక్కలు చేసి ముద్దుముద్దుగా ఇంగ్లిష్ యాక్సెంట్లో మాట్లేడే నటి మంచు లక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేయనుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలంటూ ఆమె తండ్రి - డైలాగ్ కింగ్ మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్ ను కోరినట్లు వార్తలొస్తున్నాయి.  
    
కాగా ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న మోహన్ బాబు ఇప్పుడు జగన్ కు బంధువు. జగన్ బాబాయి సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికాను మోహన్ బాబు తనయుడు విష్ణు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ బంధుత్వం ప్రకారం మోహన్ బాబుకు జగన్ వరుసకు అల్లుడు అవుతారు.  దీంతో అల్లుడి పార్టీ నుంచి కూతురిని పోటీ చేయించాలని మోహన్ బాబు కూడా కోరుకుంటున్నారట.
    
అయితే.. ఏ నియోజకవర్గం నుంచి మంచు లక్ష్మి పోటీ చేస్తుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.  చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి - శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి టిక్కెట్ కావాలని కోరుతున్నారట. ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండడంతో అక్కడి నుంచయితే గెలుపు సులభమని భావిస్తున్నారట.  అయితే.. జగన్ మాత్రం ఇంకా దీనిపై ఏమీ హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.  చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  శ్రీకాళహస్తికి టీడీపీ నుంచి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మొన్నటి ఎన్నికల్లో జగన్ సన్నిహితుడు మధుసూదనరెడ్డి గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయారు. ఈసారి ఆయన విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలాంటి దశలో ఆ రెండు నియోజకవర్గాల నుంచి టిక్కెట్ ఇవ్వడమంటే జగన్ కు కష్టమే. వీరిని కాదని రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన మంచు లక్ష్మికి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తారా అనేది అనుమానంగా ఉంది.
    
అయితే.. చంద్రబాబు లాబీయింగ్ పనిచేసి నియోజకవర్గాలు పెరిగితే మాత్రం కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల నుంచి లక్ష్మికి ఛాన్సు దొరకొచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. మోహన్ బాబు మరోవైపు నుంచి కూడా నరుక్కొస్తున్నారని టాక్.  తెలుగులో ప్రముఖ మీడియా సంస్థ అధినేతతోనూ మోహన్ బాబుకు మంచి సంబంధాలు ఉండడం.. ఆ గ్రూపులోని ఓ సంస్థకు లక్ష్మి ప్రచార ప్రకటనల్లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె పోటీ చేస్తే మీడియా పరంగా కూడా ఫుల్లు సపోర్టు దొరికేలా ప్లాన్ చేస్తున్నారట.  మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.