Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా?

By:  Tupaki Desk   |   22 Feb 2017 6:49 AM GMT
ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా?
X
రాష్ర్ట విభజనకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉండి.. లోక్ సభలో సమైక్యాంధ్ర గళం వినిపించడంలో ముందు నిలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. తన మాట చెల్లుబాటు కాకుండా నిత్య అవమానాలతో టీడీపీలో ఉండలేక ఉంటున్నారట. దీంతో విసిగిపోయిన మోదుగుల పార్టీని వీడడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.

టీడీపీ అధికారంలో లేనప్పుడు పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనే ఉనికికోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్‌ లో ఉన్న రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి రావడంతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని నచ్చజెప్పి మోదుగులను గుంటూరు వెస్ట్‌ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అయితే మోదుగులకు మంత్రి పదవి రాకపోగా… సొంత నియోజకవర్గంలోనూ ఆయనపై ఇతర నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇవన్నీ ఆయన గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఏమీ ప్రయోజనం లేకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని టాక్.

ప్రస్తతం మోదుగుల ఏదైనా సిఫార్సు చేస్తే అధికారులు కూడా పట్టించుకోవడం లేదట.. ఆయన నియోజకవర్గంలో పదవులను ఆయనకు తెలియకుండానే ఇస్తున్నారట. ఇలా అడుగడుగునా అవమానం జరుగుతోందని ఆయన ఆవేదన చెందుతున్న సమయంలో.. రెండు రోజుల కిందట చంద్రబాబు ఆయనపై ఫైర్ కావడంతో మరింత ఆవేదన చెందుతున్నారు. గుంటూరు జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు… మోదుగులపై ఫైర్ అయ్యారు. ఇష్టమొచ్చినట్టు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై మోదుగుల తీవ్ర ఆవేదనకు లోనయ్యారని... అనుచరులతో సమావేశమై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ముఖ్య అనుచరులకు సంకేతాలిచ్చారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/