Begin typing your search above and press return to search.

మోడీకి మ‌రీ ఇంత క‌క్కుర్తా?

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:29 PM GMT
మోడీకి మ‌రీ ఇంత క‌క్కుర్తా?
X
ఈ రోజు దిన‌ప‌త్రిక‌ల్ని చూసే ఉంటారు. ఒకటి కాదు..రెండు కాదు దాదాపుగా అన్ని ప‌త్రిక‌లు ప్ర‌ధాని మోడీ సీప్లేన్ లో చేసిన ప్ర‌యాణాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. జాతీయ స్థాయి మొద‌లు ప్రాంతీయ పత్రిక‌ల వ‌ర‌కూ అంద‌రూ ఒకేలాంటి ప్రాధాన్య‌త ఇచ్చారు. దేశంలో తొలిసారి సీప్లేన్ ప్ర‌యాణం చేయ‌టం.. అందులోనూ ప్ర‌ధాని మోడీ జ‌ర్నీ చేయ‌టంపై ప‌లువురు పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి చివ‌రి రోజున సీప్లేన్ లో జ‌ర్నీ చేసిన మోడీ వ్య‌వ‌హారం రోజు గ‌డిచేస‌రికి మొత్తంగా మారిపోయింది.

నిన్న విజ‌య‌గ‌ర్వంతో ద‌ర‌హాసం చేసిన మోడీ.. ఇప్పుడు మాట‌ల కోసం వెతుక్కోవాల్సి వ‌స్తోంది. సీప్లేన్ జ‌ర్నీ ఇన్ని తిప్ప‌లు తెచ్చి పెడుతుంద‌ని మోడీ కూడా ఊహించి ఉండ‌రేమో. మోడీ ప్ర‌యాణించిన కొడాయిక్ ఎన్ 181 కేక్యూ సీప్లేన్ అరేబియ‌న్ గ‌ల్ఫ్ ప్రాంతం ఉంచి బ‌య‌లుదేరి పాక్ లోని క‌రాచీ మీదుగా ముంబ‌యికి వ‌చ్చిన వైనం ఇప్పుడు వివాదంగా మారింది.

జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌లో ఉన్న మోడీ.. నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ విమానం ఎక్కార‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. మోడీ సీప్లేన్ టూర్ మీద ఇప్పుడు అన్ని పార్టీలు మండిప‌డుతున్నాయి. ఈ జ‌ర్నీలో మోడీ చేసిన పెద్ద త‌ప్పేమిటంటే.. ఆయ‌న ప్ర‌యాణించిన సీప్లేన్‌ కు సింగిల్ ఇంజిన్ ఉండ‌టం. జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌లో ఉన్న ఎవ‌రైనా స‌రే.. సింగిల్ ఇంజిన్ ఉన్న విమానాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌యాణించ‌కూడ‌దు. ఈ విష‌యాన్ని భ‌ద్ర‌తా మార్గ‌ద‌ర్శ‌కాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. డ‌బుల్ ఇంజిన్ విమానం ఎక్కితే.. ఒక ఇంజిన్ చెడినా.. మ‌రో ఇంజిన్ తో ప్ర‌యాణించే అవ‌కాశం ఉంటుంది. అదే సింగిల్ ఇంజిన్ విమానంలో ప్ర‌యాణించ‌టం అంటే.. ప్రాణ‌ర‌క్ష‌ణ‌కు భ‌రోసా ఉండ‌దు.

మ‌రి.. రూల్స్ ను బ్రేక్ చేసి మ‌రీ మోడీ సీప్లేన్ ఎందుకు ఎక్కిన‌ట్లు? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మారింది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ విమానం పాక్ మీదుగా రావ‌టం. క‌రాచీలో ఈ విమానం ఆగిందా? లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ రావ‌టం లేదు. ఒక‌వేళ మార్గ‌మ‌ధ్యంలో క‌రాచీలో కానీ ఆగి ఉంటే మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ఉండాలి. అలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ నివాసానికి పాక్ దౌత్యాధికారి విందుకు రావ‌టం.. దానికి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ హాజ‌రు కావ‌టంపై మోడీ అండ్ కో ఎంత యాగీ చేశారో తెలిసిందే. మ‌రి.. అలాంట‌ప్పుడు పాక్ మీదుగా వ‌చ్చిన విమానంలో మోడీ ఎలా ప్ర‌యాణించార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. త‌న వ్య‌క్తిగ‌త ప్రతిష్ట‌ను పెంచుకోవ‌టం కోసం సాహ‌సాలు చేయ‌ట‌మే కానీ దేశ క్షేమాన్ని ఆయ‌న కాంక్షించ‌టం లేదా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం మేకిన్ ఇండియా అనే మోడీ.. తాజాగా ప్ర‌యాణించిన సీప్లేన్ అమెరికాలో రిజిష్ట‌ర్ అయ్యిందంటున్నారు. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ప్లేన్ రిజిస్ట్రేష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బార‌త ప్ర‌యాణికుల్ని ఈ వాహ‌నంలో ఎక్కించ‌కూడ‌దు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ప్లేన్‌ను న‌డిపిన వ్య‌క్తి కెన‌డా జాతీయుడు.

అంటే.. అమెరికాలో రిజిష్ట‌ర్ అయి.. పాకిస్థాన్ మీదుగా వ‌చ్చిన విమానంలో కెన‌డా జాతీయుడు పైలెట్ గా వ్య‌వ‌హ‌రిస్తే.. అందులోమోడీ ప్ర‌యాణించ‌టం. అందులోనూ జెడ్‌కేట‌గిరి భ‌ద్ర‌త నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తూ. ఇదంతా ఎందుకు చేసిన‌ట్లు.. ఇన్ని సాహ‌సాలు ఎవ‌రి కోసం? దేశ ప్ర‌యోజ‌నం కోస‌మా? వ‌్య‌క్తిగ‌త ప్ర‌చారం కోస‌మా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం మోడీ మీద కురుస్తోంది.