సుప్రీం షాక్ కు ఆర్డినెన్స్ తో మోడీ సర్కార్ చెక్!

Mon Apr 16 2018 10:11:42 GMT+0530 (IST)

ఊహించని రీతిలో షాకుల మీద షాకులు తగులుతున్న వేళ మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తనకు ప్రతికూలంగా మారుతున్న అంశాల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఉరుము.. మెరుపు లేకుండా పడిన పిడుగు మాదిరి ఎస్సీ.. ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటం తెలిసిందే.ఈ నేపథ్యంలో.. ఈ మార్గదర్శకాల్ని తిప్పి కొట్టేందుకు మోడీ సర్కారు సమాయుత్తమవుతోంది. సుప్రీం మార్గదర్శకాలపై పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకటం.. మోడీ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న అంచనాల నేపథ్యంలో.. నష్ట నివారణ చర్యలకు తెర తీసింది. పార్లమెంటులో చట్టసవరణకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో మధ్యే మార్గంగా తన చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాలని కేంద్రం డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

సుప్రీం మార్గదర్శకాలకు చెక్ పెట్టే రీతిలో ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఆర్డినెన్స్ రూపంలో కేంద్రం జారీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మార్చి20న చట్టాన్ని సవరించటానికి ముందు చట్టం ఎలా ఉండేదో అదే రీతిలో మార్చటానికి వీలుగా జులైలో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఆర్డినెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసి.. తర్వాత దాన్ని చట్ట సభల్లో తీర్మానం చేయటం ద్వారా తాము ఎదుర్కొంటున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని భావిస్తున్నారు.

ఆర్డినెన్స్ ను తక్షణమే విడుదల చేయటం ద్వారా ఎస్సీ.. ఎస్టీల వేధింపు నిరోధక చట్టంపై తాము వ్యక్తం చేస్తున్న ఆవేదనను కేంద్రం పరిగణలోకి తీసుకున్నట్లుగా భావించే వీలుంది. అదే సమయంలో.. రానున్న వర్షాకాల సమావేశాల్లో బిల్లు రూపంలో పెట్టి పార్లమెంటులో ఆమోదించటం ద్వారా చట్టాన్ని చేస్తే ఈ ఇష్యూకు శాశ్విత పరిష్కారం లభించినట్లేనని చెప్పాలి. సుప్రీం తీర్పుతో తగిలిన షాక్ ను ఆర్డినెన్స్ తో  సరి చేయాలని భావిస్తున్న మోడీ సర్కారు ప్రయత్నంపై అత్యున్నత న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.