Begin typing your search above and press return to search.

బాబుది ద‌గాకోరు దీక్ష‌..విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   25 April 2018 5:12 PM GMT
బాబుది ద‌గాకోరు దీక్ష‌..విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోణంలో ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు తిరుపతిలో తలపెట్టిన దీక్ష దగా కోరు దీక్ష అని వైఎస్ ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట భూమన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. ఈ నెల 20న చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అన్నారు. నాలుగేళ్లుగా హోదాపై చంద్రబాబుకు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇప్పుడేందుకు దొంగదీక్షలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేసుల భయంతోనే హోదాపై చంద్రబాబు మాట్లాడలేదని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పోరాటం వల్లే హోదాపై ప్రజల్లో ఆదరణ లభించిందన్నారు.అందుకే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో తలపెట్టిన సభ దగా కోరు సభ అని భూమన అభివర్ణించారు.

మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి - రాజ్యసభ ఎంపీ వీ విజయసాయిరెడ్డి పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. మే 2వ తేదీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ నేత మళ్లా విజయప్రసాద్‌ తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు 180 కిలోమీటర్లు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నయవంచనకు నిరసనగా నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదురుగా ఉన్న దీక్షా ప్రాంగణం వేదికగా ఈ నెల 30వ తేదీన నయవంచన దీక్షలు చేయనున్నట్టు విజయప్రసాద్‌ వెల్లడించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తరిమినట్లే తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు తరిమికొడతారని చెప్పారు.