Begin typing your search above and press return to search.

సౌత్ ను క‌మ‌లం అలా క‌మ్మేయ‌నుందా!

By:  Tupaki Desk   |   25 July 2017 6:21 AM GMT
సౌత్ ను క‌మ‌లం అలా క‌మ్మేయ‌నుందా!
X
ప్ర‌పంచం మొత్తాన్ని జ‌యించిన చాలామందికి భార‌త్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి బోల్తా ప‌డ‌టం చ‌రిత్రలో క‌నిపిస్తుంది. ఇక‌.. బీజేపీ విష‌యానికి వ‌స్తే.. దేశం మొత్తాన్ని క‌మ‌ల‌వికాసం చేయాల‌న్న‌ది సుదీర్ఘ స్వ‌ప్నం. వాజ్‌పేయ్‌.. అద్వానీలాంటి వారి హ‌యాంలో సాధ్యం కాని ప‌నిని మోడీ.. అమిత్ షా ద్వ‌యం వ‌చ్చాక‌.. ఆ క‌ల‌ను దాదాపుగా సాకారం చేశార‌ని చెప్పాలి. ఎంత‌కూ అంతుబ‌ట్ట‌న‌ట్లుగా ఉండే ఈశాన్యంలోని కొన్ని రాష్ట్రాల‌తో పాటు.. అన్ని ప్రాంతాల్లోనూ త‌మ స‌త్తాను చాటుతున్న ప‌రిస్థితి. ఇంత ఆనందంలోనూ మోడీ.. అమిత్ షాల‌కు లోటు ఏమైనా ఉందంటే అది సౌత్ మీద‌నే.

ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ద‌క్షిణాదిన క‌మ‌ల వికాసం ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌ని తీరుగా మారింది. ఎంత ప్ర‌య‌త్నం చేసినా.. ద‌క్షిణాదిలోని ఏ రాష్ట్రంలోనూ త‌మ ప‌ట్టును పెంచుకోలేని ప‌రిస్థితి. గ‌తంలో క‌ర్ణాట‌క‌లో బ‌లం పెంచుకున్నా దాన్ని నిలుపుకోలేక‌పోయారు. కొద్ది నెల‌ల్లో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. ఆ రాష్ట్రంలో ఈసారి ఎట్టి ప‌రిస్ఙితుల్లో అయినా పాగా వేయాల‌ని బీజేపీ నేత‌లు త‌పిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా.. ద‌క్షిణాది మొత్తాన్ని ప్ర‌భావితం చేసేలా భారీ ఆప‌రేష‌న్‌ కు మోడీ అండ్ కో సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

అర‌కొర ప్ర‌య‌త్నం చేస్తే దక్షిణ భార‌తాన్ని సొంతం చేసుకోవ‌టం క‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన మోడీ.. మొద‌ట‌గా ద‌క్షిణాదికి చెందిన వెంక‌య్య‌ను తీసుకెళ్లి అప్రాధాన్య‌మైన ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విలో కూర్చుబెట్టే ప్ర‌క్రియ‌ను షురూ చేశారు. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్ని త‌న గుప్పిట్లో ఉంచుకొని.. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా చేస్తున్న వెంక‌య్య‌ను.. ఉప రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చోబెట్ట‌టం ద్వారా ఆయ‌న చేతులు క‌ట్టేసిన ప‌రిస్థితి.

దీంతో.. వెంక‌య్య లోటును తీర్చేందుకు వీలుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌రికొత్త నాయ‌క‌త్వానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో కీల‌క‌మైన రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క రాష్ట్రాల మీద మోడీ.. అమిత్ షాలు గురి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదంతా అయ్యాక కేర‌ళ మీద ఫోక‌స్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాది మీద ప‌ట్టు పెంచుకునే క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ గా గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి.. మోడీకి అత్యంత ఆప్తురాలైన ఆనందీబెన్‌ ను తీసుకురానున్న‌ట్లు చెబుతున్నారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా విద్యాసాగ‌ర్ రావుకు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. కీల‌క‌మైన క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌ధాని ఎక్క‌డ ఉంటే.. అక్క‌డే ఉండే ఆయ‌న ఆరో ప్రాణం అమిత్ షా సైతం బెంగ‌ళూరులో త‌న నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అంటే.. కీల‌క‌మైన బీజేపీ నేత‌లంతా సౌత్ ను క‌మ్మేసిన‌ట్లుగా చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్లు స‌మ‌యం ఉన్న వేళ‌.. ఇప్ప‌టి నుంచి ఆప‌రేష‌న్ సౌత్ మొద‌లు పెడితే త‌ప్పించి.. ఎన్నిక‌ల నాటికి పాగా వేయ‌లేమ‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రింత ప్లాన్ చేస్తున్న మోడీ.. అమిత్ షా వ్యూహాలు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతాయో చూడాలి.