Begin typing your search above and press return to search.

ఇవాంకాయా..? మోడీయా..?

By:  Tupaki Desk   |   27 March 2017 6:11 AM GMT
ఇవాంకాయా..? మోడీయా..?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారుతున్నారు. తన మాటలు, పనులతో ట్రంప్ వివాదాస్పద వరల్డ్ లీడర్ గా ముద్ర వేసుకుంటుంటే ఇవాంకా మాత్రం తన అందచందాలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవాంకా పరిచయం అక్కర్లేని పేరయిపోయింది. అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ప్రముఖుల లిస్టులో ట్రంప్ తో పాటు ఇవాంకా పేరు కూడా వినిపిస్తోంది. ఎంతలా అంటే అమెరికాకు చెందిన టైం మ్యాగజీన్ ఏటా ప్రకటించే అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆమె పేరూ పోటీలో ఉంది. గత ఏడాది వరకు ఒబామా - మోడీలు ఈ ర్యాంకింగుల్లో పోటాపోటీగా సాగేవారు. ఈసారి ఒబామా అంతర్జాతీయ యవనిక నుంచి తొలగడంతో మోడీకి దాదాపు పోటీ లేనట్లయింది. డొనాల్డ్ ట్రంప్ పేరూ మార్మోగుతున్నా అందులో నెగటివ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో మన మోడీకి ట్రంప్ కూతురు ఇవాంకా పోటీ అవుతుందేమో చూడాలి.

అమెరికాకు చెందిన ‘టైమ్’ మ్యాగజైన్ ప్రతి ఏటా ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వందమందితో ఒక జాబితాను రిలీజ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన కళాకారులు, రాజకీయ నాయకులు - శాస్తవ్రేత్తలు - ఐటి దిగ్గజాలు - వ్యాపారవేత్తలనుంచి ఓటింగ్ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. టైమ్ మ్యాగజైన్ వచ్చే నెల ఈ జాబితాను ప్రకటిస్తుంది. అయితే... ఈ టాప్ లిస్టులో రేసులో మోడీ కూడా ఉన్నారు. గత ఏడాది కూడా మోడీకి ఈ జాబితాలో స్థానం లభించింది. 2015లో తొలిసారిగా ఈ జాబితాలో మోడీకి స్థానం లభించగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ మ్యాగజైన్‌ లో మోడీకి సంబంధించిన ప్రొఫైల్ రాశారు. గత ఏడాది ఈ జాబితాలో మోడీతో పాటుగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా - సినీనటి ప్రియాంక చోప్రా - గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ - ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్ - సచిన్ బన్సల్‌ లాంటి భారతీయులకు చోటు లభించింది.

ఈ ఏడాది ఈ జాబితాలో చోటుకోసం ఎంపికయిన ప్రాబబుల్స్‌లో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఆయన కుమార్తె ఇవాంక - ఆమె భర్త - వైట్‌ హౌస్ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నెర్ - కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్ - నటుడు రిజ్ అహ్మద్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ - బ్రిటన్ ప్రధాని థెరెసా మే - చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ - కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడెన్ ఉన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/