మోడీ ట్విస్ట్ః ఏపీపై ఆసక్తి...తెలంగాణపై అనాసక్తి

Sun Feb 18 2018 21:00:01 GMT+0530 (IST)

తెలుగు రాష్ర్టాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన వ్యవహార శైలితో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఒక రాష్ట్రం తమ వద్దకు రావాలని స్వంతంగా..కీలకమైన పరిశ్రమ వేదిక సహాయంతో ప్రయత్నం చేస్తుంటే...అందుకు నో చెప్పేసి మరో రాష్ట్రం వైపు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రంగా ఆ రెండో రాష్ట్రం మోడీజీ మీ రాక అంత ప్రాధాన్యం ఏం కాదు అని చెప్తోంది. ఇంతకీ విషయం ఏంటి అంటారా...ఆ మొదటి రాష్ట్రం తెలంగాణ కాగా రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఐటీ ఒలంపిక్స్‌గా పేరొందిన ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఐటీ కాంగ్రెస్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందులోనూ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు జరగనుంది. సోమవారం ప్రారంభం అవుతున్న ఈ సదస్సుకు ప్రధానిని రప్పించేందుకు  సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో భారతదేశ ఐటీ రంగంలో కీలకమైన వేదిక అయిన నాస్కాంతో ప్రయత్నాలు కొనసాగించారు. నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ సైయంట్ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి టెక్‌మహీంద్రా ఎండీ సీఈఓ సీపీ గుర్నానీతో ఈ ఏర్పాట్లపై క్యాంప్ ఆఫీసులో మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించామని పేర్కొంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు. అయితే ఇటు మంత్రి కేటీఆర్ అటు నాస్కాం ప్రయత్నం విఫలమైంది. మోడీజీ ఈ సదస్సుకు రావడం లేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆయన ప్రసంగించనున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఇదిలాఉండగా ఏపీ విషయంలో మోడీకి అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాయంపై సమరం సాగుతున్న సమయంలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అనూహ్యమైన వర్తమానం అందింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావాలనుకుంటున్నారు. ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన శంకుస్థాపన చేయాల్సిన పథకాలు ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా .. ఆ వివరాలు చెప్పాలంటూ సర్కారుకు సమాచారం వచ్చింది. అయితే అలాంటివేవీ ప్రస్తుతం లేవని తెలిపింది. తద్వారా మోడీజీ రాకకు బ్రేకులు వేసిందని చెప్తున్నారు. స్థూలంగా ఏకకాలంలో ఒక రాష్ట్రం ఆయన రాకకోసం ఎదురుచూస్తుంటే..మరో రాష్ట్రం ఆయన రాకపట్ల అనాసక్త ప్రదర్శించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.