Begin typing your search above and press return to search.

టార్గెట్ ఉత్తర ప్రదేశ్.. మోడీ కొత్త ప్లాన్

By:  Tupaki Desk   |   24 May 2016 9:49 AM GMT
టార్గెట్ ఉత్తర ప్రదేశ్.. మోడీ కొత్త ప్లాన్
X
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్లానింగ్ మొదలు పెట్టేశారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పాగా వేసిన ఉత్సాహంతో తాజాగా ఆయన యూపీపై గురిపెట్టారు. వచ్చే సంవత్సరం యూపీలో జరగనున్న ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి - సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించిన ఆయన, యూపీకి ఏకంగా 45 మంది కేంద్ర మంత్రులను పంపుతున్నారు. రెండేళ్ల పాలనా వేడుకలను 'వికాస్ పర్వ్' పేరిట ఘనంగా నిర్వహించనున్న ఎన్డీయే తరఫున మంత్రులంతా యూపీలో పర్యటించాలని మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలోకి వేసేందుకు మోడీ ఇప్పటి నుంచే పథక రచన చేస్తున్నారు. దానికోసం తన మొత్తం బలగాన్ని అక్కడ మోహరించాలని ప్రణాళికలు వేస్తున్నారు. అందుకోసం మంత్రుల పర్యటనలు - వారు ప్రసంగించాల్సిన సభల ఏర్పాట్లను గురించి జిల్లా కమిటీలతో ఏర్పాట్లు చేయిస్తున్నారు.

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ - ప్రకాష్ ఝా తదితరులు లక్నోలో ఉండి మంత్రుల పర్యటనలను ఖరారు చేస్తారని, జేపీ నడ్డా - బండారు దత్తాత్రేయ - వీరేంద్ర సింగ్ - హర్ సిమ్రత్ కౌర్ - మనోజ్ సిన్హా - సుష్మా స్వరాజ్ - ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - నితిన్ గడ్కరీ - జయంత్ సిన్హా - నజ్మా హెప్తుల్లా - శ్రీపాద నాయక్ - సురేష్ ప్రభు తదితర మంత్రులంతా యూపీలో విస్తృతంగా పర్యటించి అక్కడ బీజేపీ విజయం కోసం పనిచేసేలా వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీ చేజారిపోయిన తరువాత వరుసగా రాష్ట్రాల్లో అపజయాలు ఎదురయ్యాయి. అయితే, తాజాగా అస్సాంలో విజయాన్ని అందించిన కొత్త వ్యూహకర్త రజత్ సేథి రాకతో బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రజత్ సేథిని పూర్తిగా ఉపయోగించుకుంటూ యూపీలో హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా పావులు కదువుతున్నారు. మరి ములాయంది పైచేయి అవుతుందో లేదంటే మోడీది పైచేయి అవుతుందో చూడాలి.