Begin typing your search above and press return to search.

జేమ్స్ బాండ్ అయిపోయిన మోడీ!

By:  Tupaki Desk   |   12 Dec 2017 8:56 AM GMT
జేమ్స్ బాండ్ అయిపోయిన మోడీ!
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు తన ప్రత్యేకతను నిలుపుకొన్నారు. తొలిసారిగా సముద్రపు విమానంలో ప్రయాణించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం.. అహ్మదాబాద్లో రోడ్షో నిర్వహించాలని మోడీ అనుకున్నారు. కానీ శాంతిభద్రతల దృష్ట్యా మోడీ రోడ్షోకు అహ్మదాబాద్ పోలీసులు అనుమతించలేదు. దీంతో మోడీ సబర్మతి నది నుంచి ధరోయి డ్యామ్ వరకు సముద్రపు విమానంలో ప్రయాణం చేశారు.

సబర్మతీ నది నుంచి ధారోయ్ డ్యామ్ వరకు సీ ప్లేన్లో ప్రయాణించేందు సిద్ధమైన ప్రధాని విమానం ఎక్కే ముందు ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని మోడీ సీప్లేన్ ప్రయాణం నేపథ్యంలో సబర్మతీ నదీతీరం వద్దకు బీజేపీ కార్యకర్తలు మోడీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మోడీ అక్కడికి చేరుకోగానే.. మోడీ.. మోడీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ధారోయ్ డ్యామ్ నుంచి అంబాజీ టెంపుల్కు రోడ్డు మార్గాన చేరుకుని దేవున్ని దర్శించుకున్నారు. పలు పూజలు చేశారు.అనంతరం ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తొలిసారిగా సముద్ర విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రతీ చోటా ఎయిర్పోర్టులు నిర్మించడానికి సాధ్యం కాదు. కావున వాటర్వేస్పై దృష్టి సారించామని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా 106 వాటర్వేస్ నిర్మించాలని అనుకుంటున్నట్లు మోడీ పేర్కొన్నారు.

మరోవైపు మోడీ సీ ప్లేన్పై రాహుల్ స్పందిస్తూ...మోడీ సీ ప్లేన్లో ప్రయాణించడం తప్పు కాదు అని కానీ అది రాజకీయంగా ఓ స్టంట్ మాత్రమే అని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌళిక సదుపాయాల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. కాగా ఈ వినూత్న ప్రచారంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా...గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.

ఇదిలాఉండగా ప్రధాని నరేంద్రమోడీ తీరును జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. అహ్మదాబాద్ లో ప్రధాని రోడ్ షోకు అధికారులు అనుమతి నిరాకరించగానే మోడీ భద్రతాపరమైన ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయన సింగిల్ ఇంజిన్ ఉన్న సీ ప్లేన్ పై ధరోయ్ డ్యాంకు వెళ్లడం భద్రతాపరమైన నియమాలను ఉల్లంఘించడమేనని అబ్దుల్లా మండిపడ్డారు. అసలా అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రధాని వంటి వీవీఐపీలు సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధమని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

పటేళ్ల యువ నాయకుడు హార్ధిక్ పటేల్ అయితే మరో అడుగు ముందుకు వేసి కామెంట్లు చేశారు. అహ్మదాబాద్ లోని సబర్మతి నదిలో మోడీ ప్రయాణించిన సీప్లేన్ తో పొలాల్లో రైతులు పురుగు మందులు చల్లుకోవాలా అని ఓపెన్ గా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. శ్రీలంక కూడా ఎంతో అభివృద్ధి చెందిందని.. రావణుడి అహంకారంతో ఆ రాజ్యం బూడిద అయ్యిందంటూ మోడీ వైఖరిని పోల్చాడు. అనేక దేశాల్లో సీప్లేన్ లు సర్వసాధారణం అని.. ఎప్పుడో వచ్చాయని హార్ధిక్ పటేల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి మిడిసిపాటు ఎక్కువైందంటూ చురకలు అంటించారు.