Begin typing your search above and press return to search.

ముంద‌స్తు దిశ‌గా మోడీ అడుగులు..?

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:34 AM GMT
ముంద‌స్తు దిశ‌గా మోడీ అడుగులు..?
X
ఈసారే కాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మోడీదే విజ‌యం. ఆ విష‌యంలో మ‌రో మాట లేదు. కాంగ్రెస్ తో స‌హా బీజేపీని వ్య‌తిరేకించే వ‌ర్గాల‌కు మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కూ అధికారం అందే అవ‌కాశ‌మే లేదంటూ నాలుగేళ్ల కింద‌ట చాలానే మాట‌లు వినిపించాయి. మోడీ లాంటి నేత ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ధీటైన నేత ఎవ‌రూ లేర‌ని.. రెండు ట‌ర్మ్స్ మోడీకి ఢోకా లేద‌న్న మాట బ‌లంగా వినిపించింది.

అయితే.. అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఇప్పుడు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మోడీ వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న విష‌యాన్ని గుర్తించిన బీజేపీ.. ఇప్పుడు మ‌రో మాస్ట‌ర్ ప్లాన్ ను తెర మీద‌కు తెచ్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.
షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌.. మేల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ఈ ఏడాది చివ‌ర నాటికి ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌..రాజ‌స్థాన్‌.. మిజోరాం.. అసెంబ్లీల‌తో పాటు ఆర్నెల్ల నుంచి ప‌ది నెల‌ల లోపు మ‌రికొన్ని రాష్ట్రాల (అరుణాచ‌ల్ ప్ర‌దేశ్.. ఏపీ.. తెలంగాణ‌.. హ‌ర్యానా.. మ‌హారాష్ట్ర.. ఒడిశా) అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అంటే.. రానున్న ఏడాది పాటు.. ప్ర‌తి ఆర్నెల్లు.. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ఏదో ఒక రాష్ట్ర ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి.

అదే జ‌రిగితే.. ప్ర‌ధాని మోడీకి ప్ర‌తికూలంగా ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎదురుదెబ్బ త‌గిలే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇందుకు భిన్నంగా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. కేంద్రం సైతం ముంద‌స్తుకు వెళ్ల‌టం మంచిద‌న్న అభిప్రాయానికి మోడీ స‌ర్కారు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం సైతం క‌స‌ర‌త్తు షురూ చేసింద‌ని.. 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. దేశ వ్యాప్తంగా జ‌ర‌పాల్సిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును దాదాపుగా పూర్తి చేసింద‌ని.. లోక్ స‌భ‌లో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ను చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసిన వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల్లో గ‌డువుకు ముందుకొన్ని రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్నినిర్వ‌హించేందుకు వీలుగా స‌వ‌ర‌ణ చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అదే ప‌నిగా త‌ర‌చూ ఎన్నిక‌లు తెర మీద‌కు వ‌స్తే.. ప్ర‌జ‌ల్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో ఇబ్బంది ప‌డుతున్న మోడీ స‌ర్కారు.. ఒకేసారి కీల‌క ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా భారీ రాజ‌కీయ ల‌బ్థిని పొందాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రి.. మోడీ స‌ర్కారు చేస్తున్న ప్లానింగ్ పై ఆయా రాష్ట్రాలు ఎలా రియాక్ట్ అవుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ప‌ది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. ఈ ఏడాది చివ‌రే సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు వీలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రూ.2వేల కోట్ల నిధుల్ని మంజూరు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ భారీ మొత్తం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కోసంగా చెబుతున్నారు. మ‌రి.. మోడీ మాస్టారి ముంద‌స్తు ఎలాంటి రాజ‌కీయ అల‌జ‌డుల‌కు గురి చేస్తుందో చూడాలి.