Begin typing your search above and press return to search.

మోడీతో పెట్టుకున్నాడు.. ప‌ద‌వే పోయింది

By:  Tupaki Desk   |   15 April 2018 5:30 PM GMT
మోడీతో పెట్టుకున్నాడు.. ప‌ద‌వే పోయింది
X
మోడీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఆయ‌నకు కోపం వ‌స్తే ప‌రిస్థితులు ఎలా మార‌తాయి? అదే స‌మ‌యంలో ప్రేమ వ‌స్తే ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అన్న విష‌యాలు ఇప్పుడిప్పుడే దేశ ప్ర‌జ‌ల‌కు మ‌రింత బాగా అర్థ‌మ‌వుతున్నాయి. ఒకే రోజులో రెండు వేర్వేరు ఘ‌ట‌న‌లకు అస్స‌లు సంబంధం లేకున్నా.. ఈ రెండింటిలోనూ మోడీ క‌నిపించ‌ట‌మే కాదు.. ఆయ‌న తీరు ఎంత విల‌క్ష‌ణంగా ఉంటుందో ఈ రెండుఉదంతాలు చెప్ప‌క‌నే చెప్పేస్తాయి.

అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఒక ద‌ళిత మ‌హిళ‌కు ప్ర‌ధాని మోడీ చెప్పుల్ని తొడిగారు. త‌న లాంటి చాయ్ వాలా ప్ర‌ధాని మంత్రి అయినా తాను సాదాసీదా మ‌నిషినని.. మ‌న‌సున్న మ‌నిషిగా ఆయ‌న త‌న‌ను తాను చెప్పుకోవ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. మైలేజీ కోసం.. తానెంత సింఫుల్ గా.. డౌన్ టు ద ఎర్త్ అన్న‌ట్లుగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తాన‌న్న విష‌యం తాజా ఉదంతంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

కంటికి క‌నిపించిన‌వ‌న్నీ నిజాలు కాన‌ట్లే.. మోడీ చేసే ప‌నుల‌తోనే ఆయ‌న్ను మ‌దింపు చేయ‌టం ఏ మాత్రం స‌రికాదు. ఒక‌ప‌క్క అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఒక ద‌ళిత మ‌హిళ‌కు తానే స్వ‌యంగా చెప్పులు తొడిగిన మోడీ.. వీహెచ్ పీ సంస్థ‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పుకునే ప్ర‌వీణ్ తొగాడియాను దెబ్బేసేలా చేశారు. ఎందుకిలా అంటే..మోడీతో పెట్టుకోవాల‌నుకునే ఎవ‌రికైనా ప్ర‌వీణ్ తొగాడియా ఎదురైన ప‌రిస్థితే ఎదుర‌వుతుంది.

వీహెచ్ పీ అంత‌ర్జాతీయ అధ్య‌క్షుడిగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ విష్ణు స‌దాశివ కోక్టే ఎన్నిక‌య్యారు. ఈ ప‌ద‌వి కోసం తొలిసారి జ‌రిగిన ర‌హ‌స్య ఓటింగ్ లో కోక్టేకు 131 ఓట్లు రాగా.. ప్ర‌వీణ్ తొగాడియా బ‌ల‌ప‌ర్చిన రాఘ‌వ‌రెడ్డికి కేవ‌లం 60 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో.. విశ్వ హిందూ ప‌రిష‌త్ తో త‌న‌కున్న 32 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లుగా తొగాడియా ఆరోపించినా ప‌ట్టించుకున్న వారే లేరు. ఆయ‌న్ను.. ఆయ‌న ఆవేద‌న‌ను.. ఆయ‌న ఆరోప‌ణ‌ల్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీంతో విశ్వ హిందూ ప‌రిష‌త్ తో తొగాడియాకున్న సుదీర్ఘ బంధం తెగిపోయిన‌ట్లుగా చెప్పాలి.

ఇదిలా ఉంటే.. హిందువుల కోసం ఈనెల 17న తాను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగ‌నున్న‌ట్లుగా తొగాడియా ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ అధ్య‌క్షుడి ఎన్నిక ఎప్పుడూ ఏకాభిప్రాయంతో సాగుతుంద‌ని.. సంఘ్ సూచ‌న‌ల‌కు అనుగుణంగా సంస్థ ప్ర‌తినిధులు ఒక అభిప్రాయానికి వ‌చ్చి భావి నేత‌ను ఎవ‌ర‌న్న‌ది నిర్ణ‌యిస్తుంటారు.

52 ఏళ్ల సంస్థ చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఎన్నిక‌లు జ‌రిగింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఎన్నిక‌లు జ‌ర‌గ‌ట‌మే కాదు.. తొగాడియాకు షాకిచ్చేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంత‌కీ ఎన్నిక‌ల్లో ఓడిన రాఘ‌వ‌రెడ్డి ఎవ‌రంటారా? ప్ర‌ముఖ మిఠాయి దుకాణం.. హైద‌రాబాదీయుల‌కు సుప‌రిచిత‌మైన పుల్లారెడ్డి కుమారుడే ఈ రాఘ‌వ రెడ్డి. ఇదిలా ఉండ‌గా.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత విజేత‌గా నిలిచిన కోక్టే త‌న టీంను ప్ర‌క‌టించారు. ఇందులో తొగాడియా మ‌ద్ద‌తుదారుల‌కు చోటు ల‌భించ‌లేదు. ఇంత‌కీ.. కోక్టే వెనుక ఎవ‌రున్నారంటారా? ఇంకెవ‌రు మోడీనేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.