క్లూ ఇస్తే కోటి... మోడీ బంపర్ ఆఫర్

Sat Sep 23 2017 11:11:14 GMT+0530 (IST)

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను ప్రభుత్వ ఇన్ఫార్మర్లుగా మారమంటోంది. ప్రజాధనానికి కాపలాగా ఉండమంటోంది. అదంతా ఏమీ ఉత్త పుణ్యానికి చేయనవసరం లేదు భారీ నజరానాలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. బినామీల గుట్టు విప్పేందుకు దేశప్రజల సహకారం తీసుకోవడం దీని లక్ష్యం. ఈ పథకంలో భాగంగా బినామీ ఆస్తుల గుట్టు విప్పేవారికి భారీ నజరానా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బినామీ ఆస్తుల వివరాలు అందించిన వారి సమాచారం విలువను బట్టి కనిష్టంగా 15 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు నజరానాగా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారట. ప్రస్తుతం బినామీ ఆస్తులపై దర్యాప్తు జరుపుతున్న ఏజెన్సీలకు కీలక సమాచారాన్ని ఇచ్చేవారికి కోటి నగదు బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సిబిడిటి వర్గాలు అంటున్నాయి.
    
అయితే ఇలా ఇచ్చే ఆస్తుల సమాచారం పనికొచ్చేదిగా ఉండాలని కీలకంగా ఉండాలన్నది ఇందులో సూత్రం. దాంతో పాటు సమాచారం ఇచ్చేవారి వివరాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచాలన్నది కేంద్రం నిర్ణయంగా తెలుస్తోంది. గత ఏడాది ప్రవేశ పెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఈ ప్రోత్సాహకం లేదు.  ఇప్పుడీ ప్రోత్సాహకాలను ముందుకు తెస్తే బినామీల బాగోతాలు బయటపడొచ్చంటున్నారు.