Begin typing your search above and press return to search.

కేంద్ర కేబినెట్ మార్పుతో ఏపీకి లాభ‌మెంత‌?

By:  Tupaki Desk   |   2 Sep 2017 6:19 AM GMT
కేంద్ర కేబినెట్ మార్పుతో ఏపీకి లాభ‌మెంత‌?
X
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. విస్తరణకు వీలుగా పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. విస్తరణలో కొందరు మంత్రుల శాఖలు మారే అవకాశముంది. 2019 లోక్‌ సభ ఎన్నికలు - త్వరలో రానున్న నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెప్తున్నారు. మార్పులకు అవకాశమిస్తూ.. నలుగురు సహాయ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా - మరికొందరు సీనియర్ మంత్రులూ క్యాబినెట్ నుంచి వైదొలుగనున్నారని తెలుస్తోంది.అయితే ఇందులో..తెలుగు రాష్ట్రం - బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన ఏపీకి ద‌క్కే ప్ర‌యోజ‌నాల గురించి...లాభ‌న‌ష్టాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు క్యాబినెట్‌ నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో ఏపీ బీజేపీ నుంచి ఒకరికి బెర్త్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో అదే సామాజిక వర్గం నుంచి పదవి ఇవ్వాలనుకుంటే విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు అవకాశం దక్కవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. గోకరాజు గంగరాజుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా పార్టీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక టీడీపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న అశోకగజపతిరాజు నిర్వహిస్తున్న పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మారే అవకాశాలున్నాయి. అలాగే శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న సుజనాచౌదరికి ఈసారి ప్రమోషన్‌ తో ఇండిపెండెంట్ చార్జి మంత్రి పదవి వస్తుందని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.

కొత్తగా క్యాబినెట్‌లో చేరనున్న వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ - ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే - పార్టీ నేతలు ప్రహ్లాద్ పటేల్ - సురేశ్ అంగడి - సత్యపాల్ సింగ్ - అనురాగ్ ఠాకూర్ - శోభా కరంద్లాజే - మహీశ్ గిర్రి - ప్రహ్లాద్ జోషి ఉండవచ్చని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లో పార్టీ బలోపేతంతోపాటు కశ్మీర్‌ లో పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కు బెర్తు ఖాయ‌మంటున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన - టీడీపీలకు చెరో బెర్త్ లభించే అవకాశాలున్నట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం సహాయ మంత్రుల హోదాలో ఉన్నవారిలో పలువురికి మంత్రులుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు.