Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు కలవలేదు కానీ.. వారిద్దరు కలిశారు

By:  Tupaki Desk   |   31 July 2015 5:04 AM GMT
చంద్రుళ్లు కలవలేదు కానీ.. వారిద్దరు కలిశారు
X
తెలుగు రాష్ట్రాల రాజకీయాల వరకూ చూస్తే.. ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న రాజకీయ పోరాటం నేపథ్యంలో.. ఈ రెండు రాష్టాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు వస్తే అన్న ఆసక్తి ఉంటుంది.

ఉప్పు నిప్పుగా మారటతో పాటు.. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోరు వ్యక్తిగతంగా మరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకే వేదిక మీద వచ్చే కార్యక్రమాల మీద అందరి దృష్టి నిలుస్తోంది. అయితే.. ఈ ఇద్దరూ కలిసే అవకాశం ఉన్నప్పటికీ ఏదో ఒక కారణంతో ఇద్దరూ కలవని పరిస్థితి.

తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వెళతారని.. అక్కడ కలిసే అవకాశం ఉందని అనుకున్నారు. దీనికి తగ్గట్లే.. ఇరు రాష్ట్రాల చంద్రుళ్లు రామేశ్వరం వెళుతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఏమైందోకానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రామేశ్వరం వెళ్లకుండా అధికారులతో సమీక్షా కార్యక్రమాల్లో మునిగిపోయారు. దీంతో.. ఇద్దరుచంద్రుళ్లు కలిసే అవకాశం లేకుండా పోయింది.

అయితే.. ఈ వేదిక మీద ఇద్దరు చంద్రుళ్లు కలుస్తారన్న అంచనా తప్పు అయితే.. మరో అరుదైన కలయిక చోటు చేసుకుంది. ప్రధాని మోడీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ.. కలాం అంత్యక్రియల సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. తనకు ఎదురు పడిన ప్రధానమంత్రి మోడీని చూసిన రాహుల్ గాంధీ రెండు చేతులతో నమస్కారం పెట్టారు. దీనికి బదులుగా.. మోడీ ప్రతి నమస్కారం పెట్టారు. చంద్రుళ్లు కలవకున్నా.. ఈ మధ్య పరస్పర వాడీవేడి విమర్శలు చేసుకుంటున్న మోడీ.. రాహుల్ ఇద్దరూ ఎదురుపడటం గమనార్హం.