Begin typing your search above and press return to search.

ప‌రిటాల‌కు అదిరిపోయే వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   10 July 2019 10:33 AM GMT
ప‌రిటాల‌కు అదిరిపోయే వార్నింగ్‌!
X
తాజా ఎన్నికల్లో రాప్తాడులో చిత్తు చిత్తుగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ధర్మవరంపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. రాప్తాడు కంటే ధర్మవరం తన‌కు సరైన నియోజకవర్గం అని భావిస్తున్న శ్రీరామ్... తాజా ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బిజెపిలో చేరడంతో ఇప్పుడు ధర్మవరం వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పరిటాల కుటుంబానికి రాప్తాడుతో పాటు ధర్మవరం కూడా వదిలి పెడుతున్నానని... ఈ రెండు నియోజకవర్గాల్లో సునీత - శ్రీరామ్ ఎవరు.. ఎక్క‌డ‌ బాధ్యతలు తీసుకుంటారో వాళ్లే తేల్చుకోవాలని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

చంద్ర‌బాబు ప‌రిటాల కుటుంబానికి రెండు ఆప్ష‌న్లు ఇచ్చారు. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పరిటాల శ్రీరామ్ ధర్మవరం బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ అవుతున్నాడట. పరిటాల ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తోందన్న వార్తలతో ధ‌ర్మ‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. ధర్మవరం నియోజకవర్గం టిడిపి నేతలకు 25 సంవత్సరాలుగా ఆదాయవనరుగా మారిపోయిందని... తాము 25 ఏళ్ల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నామ‌ని... టిడిపి తరఫున ఏ ఒక్క నాయకుడు అయిదేళ్లకు మించి ధర్మవరంలో రాజకీయం చేసి నిలబడగలుగుతాడా ? అని కేతిరెడ్డి సవాల్ విసిరారు.

వరదాపురం సూరి బిజెపిలోకి వెళ్లడంతో... పరిటాల కుటుంబాన్ని తెచ్చి ఇక్కడ శాంతిస్థాపన చేస్తామని చంద్రబాబు చెబుతుంటే ఇక్కడ ప్రజలు ఎలా ? నమ్ముతారని కూడా ప్రశ్నించారు. హడావుడి బ్యాచ్ రాజకీయాలు... హత్యా రాజకీయాలు ధర్మవరంలో న‌డ‌వ‌వ‌ని కూడా కేతిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇక జిల్లాలో గ‌తంలో ఆర్వోసీ ఎలా వ‌చ్చింది... దాని వెన‌క కుటుంబం ఎవ‌రిది ? అన్న‌ది అంద‌రికి తెలిసిన విషయ‌మే అని... అలాంటి కుటుంబాన్ని ధ‌ర్మ‌వ‌రంలో దింపి అల‌జ‌డి చేయాల‌నుకుంటే స‌హించేది లేద‌ని ఆయ‌న తెలిపారు.

ధ‌ర్మ‌వ‌రం ముందు నుంచి ఫ్యాక్ష‌న్ ప్రభావం ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ ప‌రిటాల ర‌వి ఉన్నప్ప‌టి నుంచే ఆ ఫ్యామిలీ ప్ర‌భావం ఉంది. అదే టైంలో ఇక్క‌డ ప్ర‌స్తుతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంది. ఈ టైంలో టీడీపీ నుంచి ప‌రిటాల ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తే ఇక్క‌డ మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ ప‌డ‌గ విప్పుతుందా ? అన్న సందేహాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇక కేతిరెడ్డి కూడా ప‌రిటాల ఎంట్రీ ముందే వార్నింగ్ ఇవ్వ‌డంతో ధర్మ‌వ‌రం రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.