Begin typing your search above and press return to search.

హోదా ఏపీకి అత్యవసరం -పార్లమెంటులో వైసీపీ

By:  Tupaki Desk   |   18 July 2019 1:34 PM GMT
హోదా ఏపీకి అత్యవసరం -పార్లమెంటులో వైసీపీ
X
ప్రత్యేక హోదా విషయంలో మరోసారి వైసీపీ తన నిబద్ధతను చాటుకుంది. కేంద్రం మళ్లీ మళ్లీ నో చెప్పినా... పోరాడి సాధించుకోవాలనే థృక్పతంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందకు సాగుతోంది. ఈరోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

విభజనకు ముందు దేశంలో కీలక రాష్ట్రంగా - అద్భుత ప్రగతి సాధిస్తున్న ఏపీ తన ఆస్తులు - పరిశ్రమలను అన్నిటినీ తెలంగాణకు కోల్పోయిందని - ఇపుడు ఆర్థికంగా లోటులో ఉండటమే కాకుండా అన్ని రంగాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా అవసరం చాలా ఎక్కువగా ఉందని మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఒక ప్రధాని హామీ ఇచ్చిన హోదాపై సభలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోలేదని మిథున్‌ రెడ్డి నిరసన తెలిపారు. హోదా లేకపోతే ఏపీకి పరిశ్రమలు రావని అన్నారు.

రాయితీలు పరిశ్రమలను ఆకర్షిస్తాయని - హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం పూర్తిగా మునిగిపోతుందని - రాష్ట్రంలో ఇప్పటికే తగినన్ని పరిశ్రమలు లేక నిరుద్యోగం పెరిగిందని - మౌలిక సదుపాయాలు లేక కొత్త పరిశ్రమలు తగినన్ని రాలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీకి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం నుంచి అందలేదని గుర్తుచేస్తూ వాటిని వెంటనే ఏపీకి మంజూరు చేయాలని కోరారు. అత్యుత్తమ మానవ వనరులు ఉన్న ఏపీకి ఆర్థికంగా అండగా ఉండే ఉత్పాదకత పెరిగి దేశానికి కూడా ప్రయోజకంగా ఉంటుందన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి డిమాండ్‌ చేశారు .

బడ్జెట్‌ కేటాయింపుల్లో కూడా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, కడప స్టీల్‌ ప్లాంట్‌ కు కేటాయింపులు లేకపోవడం శోచనీయం అన్నారు. ‘ఏపీకి రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటుంది. వెనుకబడిన జిల్లాలకు రెండేళ్ల నుంచి నిధులు విడుదల జరగలేదు. దుగరాజుపట్నం - పారిశ్రామిక కారిడార్‌ హామీలు పట్టించుకోలేదు. పోలవరం నిధులు ఇవ్వలేదు‘ అని కేంద్రానికి గుర్తుచేశారు మిథున్ రెడ్డి. ప్రతి కుటుంబ సంక్షేమం మాకు ముఖ్యమని - వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.