Begin typing your search above and press return to search.

ఆస్తి 13860 కోట్లు..ఆటోలో ఆఫీసుకు!

By:  Tupaki Desk   |   4 Dec 2016 6:11 AM GMT
ఆస్తి 13860 కోట్లు..ఆటోలో ఆఫీసుకు!
X
కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం (ఐడీసీ) కింద లెక్కల్లో చూపని 13,860 కోట్ల డబ్బును వెల్లడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేశ్ షా(67)ను అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం అహ్మదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత పదిహేను రోజులుగా అదృశ్యమైన ఆయన.. నెట్‌ వర్క్18. కామ్ గ్రూప్‌ నకు చెందిన ఈటీవీ గుజరాతీ చానెల్‌ లో శనివారం అకస్మాత్తుగా దర్శనమిచ్చారు. నల్ల డబ్బుకు సంబంధించి పలు సంచలన వివరాలు వెల్లడించారు. ఆ నల్లడబ్బు తనది కాదని.. పలువురు రాజకీయనేతలు - ఉన్నతాధికారులదని చెప్పాడు. కమీషన్లకు కక్కుర్తిపడి తాను ఈ పని చేశానని వెల్లడించాడు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్టూడియో ప్రాంగణంలోనే మహేశ్ షాను అరెస్టు చేశారు. ఆ సొమ్మంతా రాజకీయనేతలు - బ్యూరోక్రాట్లదని వెల్లడిస్తూ కమీషన్లకు ఆశపడి ఆ పని చేశానని ఒప్పుకున్నాడు. మహేశ్ షాను విచారించి - అతను చెబుతున్న విషయాలు వాస్తవమో కాదో తేలుస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

ఆదాయ స్వ‌చ్ఛంద వెల్ల‌డి పథకం గడువు ముగిసిన చివరి రోజు ఈ ఏడాది సెప్టెంబర్ 30న తన వద్ద 13,860 కోట్ల లెక్కల్లోలేని ధనం తన వద్ద ఉన్నదని ప్రకటించి ఒక్కసారిగా కుబేరుల జాబితాలో చేరిన మహేశ్‌ షా.. వాస్తవానికి ఓ మోస్తరు రియల్ ఎస్టేట్ వ్యాపారి అని స‌మాచారం. అపాజీ అమిన్ అండ్ కో సంస్థ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. జోధ్‌ పూర్ శివారులో ఎగుమ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే మంగళ్‌ జ్యోతి అపార్ట్‌ మెంట్‌ లో 4 బెడ్రూంల ఫ్లాట్‌ లో నివాసం. ఐడీసీ కింద అంత పెద్ద సొమ్మును వెల్లడించకముందు సంవత్సరాల్లో ఐటీ రిటర్న్ పత్రాల్లో తనకు ఏడాదికి రూ. 2-3 లక్షల ఆదాయం ఉన్నట్లుగా వెల్లడించారు. మహేశ్ షా ఆటోలో ఆఫీసుకు వచ్చేవాడని ఆయన సీఏ తెహ్ముల్ సేత్నా పేర్కొన్నారు.మహేశ్ షా గురించి ఇరుగుపొరుగువారు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తనకు రూ. 12 వేలు ఇవ్వాలని - అవి ఇంకా ఇవ్వలేదని మరొకరు చెప్పారు. మరికొందరు మాత్రం.. ఆయన కోసం అనేక మంది ఖరీదైన కార్లలో వచ్చేవారని చెబుతున్నారు.

ఇదిలాఉండ‌గా ఐడీసీ కింద వెల్లడించిన నల్లడబ్బంతా తనది కాదని - అది పలువురు రాజకీయనేతలు - ఉన్నతాధికారులు - వ్యాపారవేత్తలదని టీవీ చానెల్‌ తో మాట్లాడుతూ మహేశ్ షా వెల్లడించారు. వారి పూర్తివివరాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకే వెల్లడిస్తానని చెప్పారు. ఆ పెద్ద మనుషులు ఇస్తానన్న కమీషన్లకు కక్కుర్తిపడే ఆ నల్లధనమంతా తనదేనని ఐడీసీ కింద ప్రకటించానన్నారు. ఐడీసీ పథకం కింద వెల్లడించిన సొమ్ముకు.. నిబంధనల ప్రకారం మొత్తం కట్టాల్సిన 45 శాతం పన్నులో తొలి వాయిదా కింద రూ.1,560 కోట్లు చెల్లించాల్సింది ఉన్నదని - ఈ సొమ్ముపై ఆ బడాబాబులు చివరి నిమిషంలో చేతులెత్తేశారని, దాంతో పరిస్థితి తారుమారైందని అన్నారు. ఆ రాజకీయనేతలు - ఉన్నతాధికారుల వల్ల మొదటి విడత పన్ను బకాయిలు చెల్లించకపోయానని - ఆ నల్లడబ్బు వెనుక ఉన్నవాళ్లే సమస్యను మరింత జఠిలం చేశారని పేర్కొన్నారు. మీడియాలో వచ్చినట్లుగా తాను పరారీలో లేనని - కొన్ని అనివార్యకారణాల వల్ల తాను మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో తాను పరారీలో ఉన్నానని వార్తలు వచ్చాయని చెప్పారు. ఈ వ్యవహారంలో తన కుటుంబసభ్యులను ఇరికించవద్దని విజ్ఞప్తి చేశారు. "నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాను. నల్లధనం వివరాలు ఐటీ అధికారులకు చెబుతాను. ఈ విషయంలో వారికి పూర్తిగా సహకరిస్తాను" అని మహేశ్ షా వ్యాఖ్యానించారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/