Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజ్యంలో రైతు క‌డుపు మండింది

By:  Tupaki Desk   |   29 April 2017 4:49 AM GMT
కేసీఆర్ రాజ్యంలో రైతు క‌డుపు మండింది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీరు కాస్త చిత్ర‌మైంది. ఆయ‌న‌కు న‌చ్చితే.. కోరుకున్న దాని కంటే డబుల్ ఇచ్చి వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. అదే.. ఆయ‌న‌కు న‌చ్చ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే.. క‌డుపు మండుతున్నా.. గుండె ర‌గులుతున్నా.. అస్స‌లు ప‌ట్టించుకోరు. తాను ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు తీసుకోవాలే కానీ.. తాను ఇవ్వాల‌నుకోన‌ప్పుడు తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే మాత్రం కేసీఆర్ కు మా చెడ్డ చిరాకు వ‌చ్చేస్తుంది. 2019లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అన్ని వ‌ర్గాల వారికి ఎంతోకొంత ఇచ్చి.. అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకొని ఓట్ల వ‌ర్షం కురిపించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న విష‌యాన్ని తెలంగాణ రైతులు.. అందునా మిర్చి రైతులు అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌టం కేసీఆర్ కు అస్స‌లు న‌చ్చ‌న‌ట్లుంది.

అందుకే.. వారి డిమాండ్ల‌ను.. వారి స‌మ‌స్య‌ల‌పైనా ఆయ‌న అస్స‌లు దృష్టి సారించ‌టం లేదు. వ‌చ్చే ఏడాది నుంచి ప్ర‌తి రైతుకు ఎక‌రానికి రూ.4వేల చొప్పున న‌గ‌దును బ్యాంకు ఖాతాల్లో వేయ‌టం ద్వారా.. పంట‌కు అవ‌స‌ర‌మైన ఎరువు.. విత్త‌నాలు.. పురుగుమందు.. తొలిద‌శ‌లో అవ‌స‌ర‌మైన కూలీ డ‌బ్బుల్ని ఇచ్చేస్తున్న వైనాన్ని మా గొప్ప‌గా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

ఇలా రైతులు ఎవ‌రూ అడ‌గ‌కున్నా వారికి ప‌ర‌మాన్నం పెట్టే కేసీఆర్‌.. త‌న‌కు మూడ్ లేన‌ప్పుడు.. తాను దృష్టి పెట్ట‌ని అంశాల్లో ఎంత డిమాండ్ చేసినా.. నిర‌స‌న‌లు చేప‌ట్టినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఈ కార‌ణంతోనే నెల‌ల త‌ర‌బ‌డి మ‌ర్చి రైతులు త‌మ గోడును ఎన్నో మార్లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. రోజుల త‌ర‌బ‌డి ఆందోళ‌న చేస్తున్నా ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోపోవ‌టం.. మ‌రోవైపు నిన్న మొన్న‌టి వ‌ర‌కూ క్వింటాలు రూ.5వేలు ప‌లికిన మిర్చి శుక్ర‌వారం ఏకంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వ‌ర‌కూ ప‌డిపోవ‌టంతో మిర్చి రైతుల ఆవేశం హ‌ద్దులు దాటింది.

తీవ్ర ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసిన మిర్చి రైతులు.. ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న బాధ‌ను.. నిర‌స‌న‌ల మీద చూపించారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఖ‌మ్మం జిల్లా వ్య‌వ‌సాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకోవ‌టమే కాదు.. భారీగా ఆస్తి న‌ష్టానికి పాల్ప‌డ్డారు.

ఖ‌మ్మం మార్కెట్‌కు శుక్ర‌వారం ఒక్క‌రోజులోనే 1.5 ల‌క్ష‌ల మిర్చి బ‌స్తాలు పోటెత్తాయి. దీంతో.. ధ‌ర మ‌రింత ప‌డిపోయింది. మార్కెట్లో ప‌డిన ధ‌ర గురించి స‌మాచారం విన్న రైతులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. త‌మ బాధ‌ల్ని.. క‌ష్టాల్ని ప‌ట్టించుకోని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ.. మార్కెట్ క‌మిటీ కార్యాల‌యంపై దాడి చేసి.. రాళ్లు రువ్వారు. ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు. రైతుల్ని.. వారి ఆవేశాన్ని కంట్రోల్ చేయ‌టం పోలీసుల‌కు.. అధికారుల‌కు ఏ మాత్రం సాధ్యం కాలేదు. ఓప‌క్క రైతులకు ఏన్నో చేస్తాన‌ని చెప్పే కేసీఆర్ మాట‌ల‌కు భిన్నంగా.. రైతులు ఇంత‌లా చెల‌రేగిపోవ‌టం చూస్తే.. కేసీఆర్ రాజ్యంలో ఇలంటి సీన్లు కూడా అన్న ప్ర‌శ్న త‌లెత్త‌కుండా ఉండ‌దు. రైతుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని.. ఆగ్ర‌హాన్ని గుర్తించ‌టంలో కేసీఆర్ త‌న‌దైన శైలిలో ప‌ట్టించుకోకుండా ఉండే వ్య‌వ‌హార‌శైలికి ఆయ‌న భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా కేసీఆర్‌.. త‌న వైఖ‌రిని మార్చుకుంటారా? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న‌దైన తీరులో వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ కు సెగ పుట్టేలా తెలంగాణ రైతులు ఏం చేస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/