Begin typing your search above and press return to search.

క‌విత‌కు మంత్రి ప‌ద‌వి...వినోద్‌ కు రాజ్య‌స‌భ‌

By:  Tupaki Desk   |   26 May 2019 8:05 AM GMT
క‌విత‌కు మంత్రి ప‌ద‌వి...వినోద్‌ కు రాజ్య‌స‌భ‌
X
‘సారు - కారు - సర్కారు - పదహారు’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన అధికార టీఆర్‌‌ఎస్‌‌ అసెంబ్లీ ఎన్నికల నాటి హవా కొనసాగుతుందని పూర్తిగా నమ్మిన‌ప్ప‌టికీ ఫ‌లితాల్లో సీన్ రివ‌ర్స్ అయిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకున్న గులాబీ పార్టీకి ఆ పథకాలే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో భారీ మెజారిటీని తెచ్చిపెట్టాయి. అదే ఊపులో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలిచిన కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించాలని భావించింది. అయితే ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 9 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీఎం కుమార్తె కవిత - కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు, బి.వినోద్‌‌కుమార్ సైతం ఓటమి పాల‌య్యారు. వీరి విష‌యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

16 ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ భావిస్తే ఉన్న 11 సీట్లలో రెండింటిని కోల్పోయింది. భువనగిరి - మల్కాజ్‌ గిరి - చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొంద‌డం పార్టీ నేత‌ల‌ ఆందోళనను మరింత పెంచింది. కరీంనగర్‌‌ - నిజామాబాద్ ఫ‌లితాల‌తో పార్టీ కీలక నేతలు డీలా పడ్డారు. తెలంగాణ భవన్‌‌ వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. సీఎం కుమార్తె కవిత - కేసీఆర్‌ కు అత్యంత సన్నిహితుడు - ఢిల్లీలో పార్టీ - ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే బి.వినోద్‌‌ కుమార్‌‌ ఓటమి సీఎంను కుంగదీసినట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ - టీఆర్‌‌ ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ఫలితాలపై సమీక్ష జరిపారు.

ఈ స‌మీక్ష సంద‌ర్భంగా ఓట‌మి చెందిన క‌విత‌కు మంత్రి ప‌ద‌వి - వినోద్‌ కుమార్‌ కు రాజ్య‌స‌భ క‌ట్ట‌బెట్టే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. క‌విత‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకొని ఆమెను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా మ‌హిళా మంత్రి లేని లోటు తీర్చిన‌ట్లు కూడా అవుతోంద‌ని అంటున్నారు. మ‌రోవైపు, పార్టీ సీనియ‌ర్ నేత అయిన వినోద్ సేవ‌లు ఢిల్లీలో ఉప‌యోగించుకునే కోణంలో...ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న నుంఉచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఈ విష‌యంలో తుది నిర్ణ‌యం ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.