Begin typing your search above and press return to search.

సెల్ఫీ.. గోల్ చేసుకున్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   19 Feb 2019 6:43 AM GMT
సెల్ఫీ.. గోల్ చేసుకున్న కేంద్రమంత్రి
X
మోడీ క్యాబినెట్లోని మంత్రులు నిత్యం ఎవరో ఒకరు వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల త్రిపురలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ఎదుటే ఓ కేంద్రమంత్రి సహచర మహిళా మంత్రి నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. ఈ సంఘటన ఇంకా మరువక ముందే మరో కేంద్ర మంత్రి తన ఫేస్ బుక్ ఖాతాలో అమరు జవాను పార్థిన దేహంతో సెల్ఫీ దిగిన ఫోటో పోస్టు చేసి దుమారం రేపాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈనెల 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురం వద్ద జేష్ మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా అమరవీరుల పార్థివ దేహాలను ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు నివాళులర్పించాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేరళలోని కోజికోడ్ విమానశ్రయానికి అమర జవాను వసంత్ కుమార్ పార్థివ దేహం చేరుకుంది. కేరళ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాజ్యసభ సీనియర్ నాయకుడు అల్ఫోన్స్ కన్నన్ థనమ్ పార్థివ దేహాన్ని స్వీకరించారు. అయితే ఈ సందర్భంగా తీసిన ఫోటోను ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

‘అమరవీరుడి పార్థివ దేహం వద్ద సెల్ఫీ దిగుతావా? సిగ్గు లేదా అల్ఫోన్స్ కన్నన్ థనమ్..’ అంటూ షాన్ షకీర్ అనే వ్యక్తి ఘాటుగా స్పందించాడు. ‘ ఈ ఫోటోలో మీ దృశ్యం సరిగా కనిపించడం లేదని.. మంచి కెమెరా వినియోగించాల్సి ఉండేదని.. కామెంట్ చేశాడు. అలాగే బిజోయ్ అనే వ్యక్తి రాజు(నరేంద్ర మోడీ)కి తగ్గట్టే అతని సహచరులు ఉన్నారంటూ కామెంట్ గుప్పించాడు. విమర్శలు ఎక్కువడంతో కేంద్రమంత్రి తన పోస్టును డిలిట్ చేశారు.

ఇందులో కనిపించిన చిత్రం సెల్ఫీ కాదని.. తనకు సెల్ఫీ దిగే అలవాటు లేదని కేంద్రమంత్రి వివరణ ఇచ్చేలోపే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకముందు కూడా అల్ఫోన్స్ నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు. కేరళలో వరదలు ముంచేసిన సందర్భంలో బ్లూ జీన్స్, బ్లూ టీ షర్ట్ ధరించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఫొటో తన ఖాతాలో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు వచ్చారా? పిక్నిక్ ప్రొగ్రాంకు వచ్చారా అంటూ అప్పట్లో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు.

మళ్లీ అలాగే ఫేస్ బుక్ లో అమర జవాను పార్థివ దేహంతో కూడిన ఫొటోను పోస్టు చేసి విమర్శల పాలయ్యాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రులు సెల్ఫీలతో సెల్ఫ్ గోల్ అవుతున్నారు. సోషల్ మీడియాతో పాపులర్ కావాల్సింది పోయి.. దిగజారిపోవడం బీజేపీకి చెందిన కేంద్రమంత్రులకే చెల్లింది.