Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే దుర్మార్గం చేశారా?

By:  Tupaki Desk   |   21 March 2017 7:43 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే దుర్మార్గం చేశారా?
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిలో జ‌రుగుతున్న తొలి శాస‌న‌స‌భా స‌మావేశాల్లో ప‌లు దుర్మార్గ‌మైన ఘ‌ట‌న‌కు కేంద్రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికార ప‌క్షంపై విప‌క్షం, విప‌క్షంపై అధికార ప‌క్షం మాట‌ల తూటాల‌ను పేల్చుకోగా... రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌తంగా దిగ‌జారి చేసుకున్న వ్యాఖ్య‌లు కూడా ఈ స‌మావేశాల్లో చోటుచేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే... నేటి ఉద‌యం స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి, టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకోగా... స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేసిన త‌ర్వాత అసెంబ్లీ ప్రాంగ‌ణంలోని మీడియా పాయింట్ వ‌ద్ద కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. మీడియా పాయింట్ వ‌ద్ద అనిత‌, ఈశ్వ‌రి వాగ్వాదం చేసుకోగా, గిడ్డి దెబ్బ‌కు వంగ‌ల‌పూడి పరార‌య్యారు.

ఆ త‌ర్వాత తిరిగి అనిత రంగంలోకి దిగ‌గా, ఇంకా మీడియాతో మాట్లాడుతున్న గిడ్డి అండ్ కోను అక్క‌డి నుంచి ప‌క్క‌కు తోసివేసే య‌త్నానికి టీడీపీ పాల్ప‌డింద‌నే చెప్పాలి. గిడ్డి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేక వెనుదిరిగిన అనిత‌... ఆ త‌ర్వాత రెండో ప‌ర్యాయం అక్క‌డికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆమె వెంట మంత్రి పీత‌ల సుజాత‌, కొంద‌రు టీడీపీ పురుష ఎమ్మెల్యేలు వ‌చ్చారు. వ‌చ్చీరాగానే మంత్రి పీత‌ల... వైసీపీ ఎమ్మెల్యేల‌ను చేతుల‌తో నెట్టివేసే య‌త్నం చేయ‌గా, టీడీపీ పురుష ఎమ్మెల్యేలు దూరంగానే నిల‌బ‌డ్డారు. అప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ మార్ష‌ల్స్ (మ‌హిళా సిబ్బంది) చుట్టుముట్టారు. అంటే మ‌రికాసేప‌ట్లోనే వైసీపీ స‌భ్యుల‌ను మార్ష‌ల్స్ అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపించింది.

ఈ విష‌యాన్ని గ్ర‌హించాడో, ఏమో తెలియ‌దు గానీ... టీడీపీ ఎమ్మెల్యే అప్ప‌ల‌నాయుడు త‌న దుర్మార్గానికి తెర తీశాడు. మార్ష‌ల్స్‌ను తోసుకుంటూ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేల వెన‌క్కు చేరిన అప్ప‌ల‌నాయుడు... వారిని తాకుతూనే... వారి ముందు ఉన్న బ‌ల్ల‌ను బ‌ల‌వంతంగా జ‌రిపేందుకు య‌త్నించారు. ఈ విషయాన్ని గమ‌నించిన మ‌హిళా మార్ష‌ల్స్ వారించినా... అప్ప‌ల‌నాయుడు ఏమాత్రం వినిపించుకోలేదు. మ‌రింత ముందుకు జ‌రిగి... వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేల‌ను తాకుతూ మ‌రింత ముందుకు వ‌చ్చారు. ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తోంద‌ని భావించిన కొంద‌రు పోలీసు అధికారులు... అప్ప‌ల‌నాయుడును గ‌ద్దించి మ‌రీ వెన‌క్కు వ‌చ్చేయ‌ని చెప్పాల్సి వ‌చ్చింది.

అధికారుల హెచ్చ‌రిక‌ల‌తో త‌న దుర్మార్గం బ‌య‌ట‌ప‌డింద‌ని భావించారో, ఏమో తెలియ‌దు గానీ ఆయ‌న వెనక్కు త‌గ్గారు. ఓ వైపు మంత్రి పీత‌ల త‌మ‌ను తోసేస్తూ ఉండ‌టంతో అప్ప‌ల‌నాయుడి దుర్మార్గాన్ని వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేలు అంత‌గా గుర్తించ‌లేక‌పోయార‌నే చెప్పాలి. అయితే అప్ప‌ల‌నాయుడి దుర్మార్గానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు అన్ని మీడియా ఛానెళ్ల‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/