Begin typing your search above and press return to search.

మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు, కానీ!

By:  Tupaki Desk   |   23 Aug 2019 11:57 AM GMT
మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు, కానీ!
X
రాజధానిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు వేల కోట్ల రూపాయల దందాలు చేశారని - భూములను ముందుగా కొనుగోళ్లు చేసే వ్యూహాలతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని అందుకే ఇప్పుడు ఉలిక్కిపడుతూ ఉన్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. రాజధాని విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. రాజధానిని మార్చాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే రాజధాని విషయంలోనే ఇటీవలి వరదలతో ప్రజల్లో కూడా రకరకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని వాటి గురించినే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారని కొడాలి వ్యాఖ్యానించారు.

తాము రాజధానిని మార్చాలని అనుకోవడం లేదని - ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు అతిగా రియాక్ట్ అవుతూ ఉందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ రాజధానిని మార్చాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే తెలుగుదేశం పార్టీ చేసే ఆందోళనలు దాన్ని ఆపలేవని కొడాలి నాని వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజధాని విషయంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దందాలపై విచారణ తప్పదన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో కోర్టు పూర్తిగా స్టే విధించలేదని నాని అన్నారు. అది తాత్కాలిక స్టే మాత్రమే అని - అవినీతి-అక్రమాలను అరికట్టడమే తమ ఉద్దేశం అని మంత్రి తేల్చి చెప్పారు. ప్రభుత్వ ధనాన్ని అక్రమార్కులు దోచుకుండా చూడటమే రివర్స్ టెండరింగ్ ఉద్దేశం అన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని కోర్టు కూడా ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. అవినీతిపై పోరు విషయంలో సీఎం జగన్ అడుగులు ముందుకే కాని వెనక్కు ఉండవని మంత్రి వ్యాఖ్యానించారు.