Begin typing your search above and press return to search.

ఏపీలో తెలంగాణోళ్లకు సౌకర్యాలు పెంచాలంట

By:  Tupaki Desk   |   7 Feb 2016 4:07 AM GMT
ఏపీలో తెలంగాణోళ్లకు సౌకర్యాలు పెంచాలంట
X
తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల కోసం.. వారి అభ్యున్నతి కోసం.. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టాలని అడిగే దమ్ము.. ధైర్యం ఉన్న పార్టీలు ఏమైనా ఉంటాయా? ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే తమ ప్రాణాలు పణంగా పెడతామని మాట్లాడే నేతలు సైతం ఈ తరహా స్టేట్ మెంట్లు ఇచ్చేందుకు వెనుకాముందు ఆడతారు. కానీ.. తెలంగాణోళ్లకు ఏపీలో సౌకర్యాలు పెంచాలంటూ డిమాండ్ చేసే సత్తా తెలంగాణ రాష్ట్ర మంత్రులకే చెల్లుతుంది.

ఏపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలకు సౌకర్యాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేరళలోని శబరిమలలో మాదిరి తిరుమలలోనూ తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేయటం గమనార్హం. తెలంగాణలో ఉండే ఏపీ ప్రజల కోసం కాని.. సీమాంధ్రుల కోసం ఎక్కడైనా.. ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయా? లాంటి ప్రశ్న ఎవరూ అడగరు. అసలు అలాంటి ఊసే ఉండదు. కానీ.. అదే సమయంలో తెలంగాణ వారికి సౌకర్యాలు పెంచాలన్న డిమాండ్ ను చేసే ధైర్యం టీఆర్ ఎస్ నేతలకే చెల్లుతుంది.

యాదాద్రికి వచ్చేవారి కోసమైనా.. ఏపీకి చెందిన శ్రీశైలం వెళ్లి.. అక్కడి సరిహద్దు అయిన తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఒప్పుకోని తెలంగాణ పర్యాటక శాఖ వైఖరి గురించి కానీ.. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులకు సౌకర్యాలు పెంచాలని.. వారికి అసౌకర్యం కలిగే అంశాల మీద ఎప్పుడు పెదవి విప్పిన పాపాన పోలేదు సీమాంధ్ర మంత్రులు. అందుకు భిన్నంగా మంత్రి ఇంద్రకరణ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తమ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. ఈ అంశాలపై టీటీడీ అధికారులతో తాము మాట్లాడతామని ఆయన చెబుతున్నారు.

శ్రీశైలం వెళ్లిన భక్తులు బోట్ లో అక్కడి సరిహద్దుగా ఉండే తెలంగాణ పరిధిలోని పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు అనుమతించకుండా లొల్లి పెట్టే తెలంగాణ అధికారుల్ని వారించి.. ఏపీ భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మినహాయింపులు ఇవ్వలేదు? తిరుమలలో సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న వారు.. ఏపీ పరిధిలోనే ఉండి.. కొద్ది ప్రాంతం తెలంగాణ అధీనంలో ఉండే శ్రీశైలంలో ఆంక్షలతో అడ్డుకట్ట వేసేవారు తమవాళ్లకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ మాత్రం చేసేయటం గమనార్హం.

శ్రీశైలం దగ్గరి తెలంగాణ ప్రాంతంలో ఒకతీరులో మాట్లాడే తెలంగాణ అధికారపక్షం.. అదే ఏపీలోని తిరుమల వరకూ వచ్చేసేసరికి భిన్నమైన వాణిని వినిపించటం గమనార్హం. తమ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయటం చూస్తే.. సీమాంధ్ర నేతల చేతకానితనం.. తెలంగాణ నేతల తెలివితేటలు కనిపించక మానవు. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంటోళ్లను చూసైనా సీమాంధ్ర మంత్రులు తెలంగాణలో సీమాంధ్రుల సౌకర్యాల గురించి వ్యూహాత్మకంగా పెదవి విప్పితే బాగుంటుంది.