Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి చెప్పిన దోపిడీ విన్నారా బాబు!

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:43 AM GMT
ఏపీ మంత్రి చెప్పిన దోపిడీ విన్నారా బాబు!
X
చేతిలో అధికారం ఉంది. అక్ర‌మాల్ని నివారించ‌గ‌లిగే స్థాయిలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న దోపిడీ గురించి చెప్పి వాపోతున్నారు ఏపీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు. చేతిలో అధికారం ఉన్న‌ప్ప‌టికీ భారీగా సాగుతున్న దోపిడీకి చెక్ పెట్ట‌లేక విమ‌ర్శ‌లు చేస్తున్న వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

అధికార‌ప‌క్ష నేత‌లు.. అందునా మంత్రిస్థానంలో ఉన్న వ్య‌క్తి నోటి నుంచే ఇలాంటి మాట‌లు వ‌స్తే మిగిలిన వారి ప‌రిస్థితి ఏమిటి? త‌ర‌చూ గొప్ప‌లు చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. తాజాగా త‌న మంత్రి చేసిన వ్యాఖ్య‌ల్ని విన్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ పోస్టుల భ‌ర్తీలో భారీ దోపిడీ జ‌రుగుతోంద‌ని మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ పోస్టుల భ‌ర్తీకి అభ్య‌ర్థుల నుంచి కాంట్రాక్ట‌ర్లు భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటున్న‌ట్లుగా ఆరోపించారు. రోజుకు ప‌ది నుంచి ప‌న్నెండు గంట‌ల‌కు పైనే ప‌ని చేయించుకుంటూ.. వారికి మాత్రం పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వ‌టం లేద‌ని మండిప‌డ్డారు.

క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలో పోస్టుల భ‌ర్తీ జ‌ర‌గాల‌న్న సూచ‌న చేసిన ఆయ‌న‌.. అలా జ‌రిగితే అవినీతికి అడ్డుక‌ట్ట వేయొచ్చ‌న్నారు. క‌మిష‌న్ పేరుతో మూడో వంతు మొత్తాన్ని తీసేసుకుంటున్నార‌ని.. పీఎఫ్.. ఈఎస్ ఐ వంటి క‌నీస సౌక‌ర్యాల్నికూడా అమ‌లు చేయ‌టం లేద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఇంత అవినీతి.. అంత అవినీతి అని గుండెలు బాదుకునే బ‌దులు.. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా ఎందుకు ప్ర‌య‌త్నించ‌రు. ఒక మంత్రిస్థానంలో ఉన్న నేతే ఇలా చెబుతుంటే.. రాష్ట్రంలో పాల‌న సంగ‌తేంటి? అక్ర‌మార్కుల అక్ర‌మాలు మీ పాల‌న‌లో అలా సాగిపోతూనే ఉంటాయా చంద్ర‌బాబు?