Begin typing your search above and press return to search.

బాబు స‌న్నిహితుడిపై మంత్రి ఆది వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   21 May 2018 5:24 AM GMT
బాబు స‌న్నిహితుడిపై మంత్రి ఆది వ్యాఖ్య‌లు
X
వివాదాస్ప‌ద వ్య‌క్తుల్ని వెంట పెట్టుకోవ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా.. ఒక పార్టీ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించే ముఖ్య‌నేత త‌న స‌న్నిహిత వ‌ర్గాన్ని త‌యారు చేసుకునే విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తారు. ఎంతో జాగ‌రూక‌తో నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఏ చిన్న మ‌చ్చ ఉన్నా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

అలాంటిది చంద్ర‌బాబు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తారు. కావాలంటే ఆయ‌న‌కు సన్నిహితుల‌న్న వారి లిస్ట్ ఒక‌టి వ‌రుస‌గా రాసుకురండి. ఆ పేర్ల‌లో చాలావ‌ర‌కూ విశ్వ‌స‌నీయ వ్య‌క్తులుగా.. బాబు ఇమేజ్ ను పెంచే వారుగా ఉండ‌రు. బాబు స‌న్నిహితులు ఆయ‌న మీద ఆధార‌ప‌డ‌తారే త‌ప్పించి.. త‌మ కార‌ణంగా అధినేత ఇమేజ్ మ‌రింత పెరిగేట‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. అలాంటి వారిలో సీఎం ర‌మేశ్ పేరు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది.

బాబుకు అత్యంత ముఖ్యుడైన ఆయ‌న తీరు త‌ర‌చూ వివాదాస్ప‌ద‌మ‌వుతూ ఉంటుంది. ఆయ‌న పోక‌డ‌ల‌పై తెలుగు త‌మ్ముళ్లు ప‌లువురు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుంటారు. రాజ‌కీయంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు త‌ర‌చూ వివాదాస్ప‌దం అవుతూ ఉంటాయి. అయినా బాబు స్పందించ‌ర‌న్న విమ‌ర్శ ఉంది.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం ఆ మాట‌ను నిజం చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బాబుకు జాన్ జిగిరీ అయిన సీఎం ర‌మేశ్ పై ఆయ‌న పార్టీకే చెందిన ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ ప్ర‌తి ప‌నికీ అడ్డొస్తే.. క‌నిపిస్తే కాల్చివేత రోజులు వ‌స్తాయ‌ని వార్నింగ్ ఇచ్చారు. పోట్ల‌దుర్తి కుటుంబీకుల‌కు చెప్పుల‌తో కొట్టే రోజులు వ‌స్తాయ‌న్న మంత్రి.. ప్ర‌తి దానికి అడ్డుప‌డ‌టం.. అన‌వ‌స‌ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.

తాను గ‌న్ లాంటోడిన‌ని.. కార్య‌క‌ర్త‌లు బుల్లెట్ల‌ను అందిస్తే త‌న ప‌ని కాల్చ‌టంగా ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై కొంద‌రు నీచంగా మాట్లాడుతున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. రామ సుబ్బారెడ్డి కానీ ఆయ‌న వ‌ర్గీయులు కానీ దేనికైనా సిద్ధ‌ప‌డితే ఎదురొచ్చేందుకు తాను సిద్ధ‌మ‌న్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు ర‌మేశ్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసుకుంటున్నార‌ని.. వంద‌ల కోట్ల ప‌నులు చేస్తున్నా తాము ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నారు. త‌న‌కు చంద్ర‌బాబు క‌చ్ఛితంగా టికెట్ ఇస్తార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసిన ఆది.. తాను ఏం చేసినా కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యాలు తీసుకుంటాన‌న్నారు. సొంత పార్టీ నేత మీద ఇంత తీవ్రంగా విరుచుకుప‌డ‌టం దేనికి నిద‌ర్శ‌నం? ఇలాంటి వాటిపై బాబు ఏం చేస్తారు?