Begin typing your search above and press return to search.

కోటీశ్వ‌రులే అయినా వ‌ల‌స‌ప‌క్షులేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:21 AM GMT
కోటీశ్వ‌రులే అయినా వ‌ల‌స‌ప‌క్షులేన‌ట‌!
X
భుక్తి కోసం బ‌య‌ట ఊరికి వెళ్లటం సామాన్యుల‌కు కామ‌నే. అయితే.. కోట్ల‌కు కోట్లు ఉన్నా స‌రే.. వేరే ప్రాంతానికి వ‌ల‌స వెళ్లే ధోర‌ణి మాత్రం కామ‌న్ గాఉంటుంద‌న్న వాస్త‌వాన్ని తాజాగా ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. నిరుపేద‌లు.. సామాన్యులు ఉపాధి కోసం వ‌ల‌స వెళ్ల‌టం మామూలే అయినా.. కోట్ల‌కు కోట్లు ఉన్న కోటీశ్వ‌రులు సైతం పైస‌ల కోసం తామున్న ప్రాంతాన్ని వ‌దిలేసే వేరే చోట‌కు వెళ్లే వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌న్న వైనాన్ని గ్లోబ‌ల్ వెల్త్ మైగ్రేష‌న్ రివ్యూ తాజాగా వెల్ల‌డించింది.

ఉన్న సంప‌ద‌ను మ‌రింత పెంచుకోవ‌టానికి.. మ‌రింత సంపాదించేందుకు కోటీశ్వ‌రులు సైతం వ‌ల‌స‌బాట ప‌డుతున్నార‌ని.. పైస‌ల కోసం ప‌రాయి దేశానికి వెళ్లేందుకు సైతం వెనుకాడ‌టం లేద‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోటీశ్వ‌రులు సైతం వ‌ల‌స ప‌క్షులుగా మార‌టానికి ఏయే అంశాలు వారిని అలా చేస్తున్నాయ‌న్న అంశంపై తాజాగా అధ్య‌య‌నం చేయ‌గా.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

సంప‌ద‌ను మ‌రింత పెంచుకోవ‌టానికి తామున్న ప్రాంతం నుంచి.. దేశం నుంచి వేరే ప్రాంతానికి.. దేశానికి వెళ్లే ధోర‌ణి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌దేన‌ని.. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారిలో భార‌త్ రెండో స్థానంలో నిలుస్తుంద‌ని తేలింది. కోటీశ్వ‌రులే అయినా.. త‌మ‌కున్న సంప‌ద‌ను మ‌రింత పెంచుకోవ‌టానికి అవ‌కాశాలున్న దేశాల‌కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఈ ఛాయిస్ లో అత్య‌ధికులు ఆస్ట్రేలియాను త‌మ త‌దుప‌రి మ‌జిలీగా ఎంపిక చేసుకుంటూ ఉంటే.. త‌ర్వాతి స్థానాల్లో అమెరికా.. కెన‌డా.. న్యూజిలాండ్ తో పాటు కొన్ని అర‌బ్ దేశాలు ఉన్న‌ట్లు తేలింది. గ‌డిచిన ఏడాది మ‌న దేశం నుంచి వ‌ల‌స వెళ్లిన కోటీశ్వ‌రుల సంఖ్య 7వేలుగా చెబుతున్నారు. అదేస‌మ‌యంలో 2016లో అయితే.. విదేశాల‌కు వ‌ల‌స వెళ్లిన సంప‌న్నుల సంఖ్య 9500లుగా చెబుతున్నారు. 2014 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 23 వేల ముంది కోటీశ్వ‌రులు భార‌త్ ను విడిచి వెళితే.. వీరిలో అత్య‌ధికులు బ్రిట‌న్‌.. దుబాయ్.. సింగ‌పూర్ల‌లో త‌మ శాశ్విత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌టం క‌నిపిస్తోంది.

భార‌త్ ను వదిలేసి.. ఇదే త‌ర‌హా ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఉంద‌న్న విష‌యంలోకి వెళితే.. గ‌త ఏడాదిలో 95వేల మంది కోటీశ్వ‌రులు త‌మ దేశాల్ని విడిచి పెట్టి ఇత‌ర దేశాల‌కు వల‌స వెళ్లారు. 2016లో ఈ సంఖ్య 82 వేలు కాగా.. 2015లో ఇది 64వేలుగా తేలింది. సంప‌ద‌ను పెంచుకోవ‌టానికి ఇత‌ర దేశాల‌కు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

డ‌బ్బుకు డ‌బ్బు.. సంఘంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న‌ప్ప‌టికీ.. విదేశాల‌కు వెళుతున్న సంప‌న్నుల‌కు సంబంధించి మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. వీరి వ‌ల‌స‌ల్ని ఆర్థిక అంశాలే ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ట‌. తాము వ‌ల‌స వెళ్లే దేశంలో ప‌న్నులు త‌క్కువ‌గా ఉండే దేశాల్ని ఎంపిక చేసుకోవ‌టం.. భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో పాటు.. త‌మ‌కున్న అవ‌కాశాల‌కు మించిన అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్న న‌మ్మ‌కం కుదిరిన వెంట‌నే పెట్టాబేడా స‌ర్దుకోవ‌టానికి ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌ట‌.