Begin typing your search above and press return to search.

మా ఆయనా.. డ్రగ్స్ వాడటమా?

By:  Tupaki Desk   |   9 Aug 2017 7:22 AM GMT
మా ఆయనా.. డ్రగ్స్ వాడటమా?
X
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వాళ్లందరూ కూడా తాము ఎలాంటి తప్పూ చేయలేదని.. జీవితంలో ఒక్కసారి కూడా డ్రగ్స్ ముఖం చూడలేదనే అన్నారు. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న నెదర్లాండ్స్ దేశస్థుడు కమింగ విషయంలోనూ అతడి భార్య మేరీ ఇలాంటి వాదనే వినిపిస్తోంది. తన భర్త అమాయకుడని.. అతణ్ని అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మేరీ అంది. తన భర్త జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. వాటి అమ్మకాలు కూడా చేపట్టలేదని మేరీ స్పష్టం చేసింది. తన భర్తకు తాను నూటికి నూరు మార్కులు వేస్తానని.. పోలీసులు కుట్ర పూరితంగా తన భర్తను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది.

తాము ఇంటిలో లేని సమయంలో పోలీసులు సోదాలకు వచ్చారని.. తాము వచ్చేసరికి ఇంట్లో డ్రగ్స్ దొరికినట్లుగా చెప్పి తన భర్తను అదుపులోకి తీసుకున్నారని.. ఇదేం అన్యాయమని మేరీ ప్రశ్నించింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన భర్తకు హైదరాబాద్ అంటే ఇష్టమని.. తన కోసమే ఈ సిటీలో ఉన్నాడని.. తమ పిల్లల్ని ఈ సిటీలోనే పెంచాలనుకుంటున్నామని మేరీ తెలిపింది. డ్రగ్స్ కేసు నుంచి తన భర్త త్వరలోనే బయటపడి తమ జీవితం మళ్లీ మామూలు స్థితికి చేరుతుందని మేరీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘గెట్ మైకీ ఔట్’ అంటూ తన భర్తను ఉద్దేశించి ఫేస్ బుక్ లో మేరీ ఓ కాంపైన్ మొదలుపెట్టడం విశేషం. కమింగ తల్లి.. ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడి కోసం వీడియోలు పెడతున్నారు. ఐతే పోలీసులు మాత్రం కమింగ డ్రగ్ రాకెట్లో కీలక పాత్రధారి అని.. అతడి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే అరెస్ట్ చేశామని అంటున్నారు. తాము కమింగ ఇంటికి రైడ్ కు వెళ్లే లోపే అతను తన దగ్గరున్న సరకునంతా అమ్మేసి సాక్ష్యాలు లేకుండా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.