Begin typing your search above and press return to search.

పేదోడి ఇంటికి రూ.5.04 సరే..మధ్యతరగతోడికి?

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:06 AM GMT
పేదోడి ఇంటికి రూ.5.04 సరే..మధ్యతరగతోడికి?
X
పేదలకు సాయం చేయటం తప్పు కాదు. కానీ.. అనుక్షణం కష్టపడుతూ.. చాలీచాలని జీతాలతో తన బాధలు.. కష్టాలు.. ఇబ్బందులు బయటకు చెప్పుకోకుండా.. అడ్డుపడే ఆత్మాభిమానంతో నోరు విప్పకుండా కూలీ కాకున్నా.. కూలీ బతుకులు బతికే మధ్యతరగతి జీవి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించవు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కట్టిస్తున్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్ల వ్యవహారమే తీసుకుంటే.. అత్యల్ప ఆదాయాన్ని సంపాదించే వారికి ఆదరవులుగా ఉండేందుకు తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తోంది. మానవత్వంతో ఇది సరైన చర్యే అనుకుంటే.. పేదోడికే డబుల్ బెడ్ రూం అయితే.. దిగువ.. మధ్యతరగతి జీవి పరిస్థితి ఏమిటి..?

అతగాడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదు. ఏ పథకానికి అతగాడు అర్హుడు కాదు. అద్దె కొంపల్లో బతుకుతూ.. జీవితం మీద ఎలాంటి భరోసా లేకుండా బతికేస్తూ.. అప్పులతో.. బాధ్యతలతో నలభైల్లోనే అరవై ఏళ్ల ముసలితనంతో కునారిల్లే వారి పరిస్థితి ఏమిటి? పేదల్ని ఓటుబ్యాంకుగా చూసే పార్టీలకు.. దిగువ.. మధ్యతరగతి జీవులు సంఘటితంగా ఉండకపోవటం.. గళం విప్పకపోవటం వారి పాలిట శాపంగా మారుతోంది.

కూలీనాలీ చేసుకునే.. పేదోళ్లకే డబుల్ బెడ్ రూంల్ ఇస్తే.. మరి.. దిగువ మధ్యతరగతి.. మధ్యతరగతి జీవుల సంగతేంది? ఒక పేదవాడికి రూ.5.04 లక్షలతో ఇల్లు కట్టిస్తున్నారు.. ఓకే. మరి.. మిగిలిన వారి పరిస్థితేంది? వారికేమీ పది లక్షలో.. పదిహేను లక్షలతోనో ఇల్లు కట్టించనక్కర్లేదు. కనీసం.. పేదోడికి ఇచ్చే ఇల్లు అయినా ఇస్తే చాలు. అంత పెద్ద మనసు ప్రభుత్వానికి దిగువ.. మధ్యతరగతి జీవుల మీద ఉందా..?