Begin typing your search above and press return to search.

అనూ కోసం స‌త్య!..గ్రీన్‌ కార్డ్‌ నే వ‌ద్ద‌న్నాడా?

By:  Tupaki Desk   |   26 Sep 2017 11:46 AM GMT
అనూ కోసం స‌త్య!..గ్రీన్‌ కార్డ్‌ నే వ‌ద్ద‌న్నాడా?
X
అనంత‌పురం జిల్లాకు చెందిన స‌త్య‌నాదెళ్ల ఎంఐటీ (మ‌ణిపాల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ)లో చ‌దువుకుని అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నమైక్రోసాఫ్ట్‌ కు ఆయ‌న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈవో)గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. స‌త్య నాదెళ్ల తాజాగా హిట్ రిఫ్రెష్ అనే పుస్త‌కాన్ని రాశారు. ఇందులో భాగంగా త‌న పెళ్లి నాటి ప‌రిస్థితుల‌ను వివ‌రించిన స‌త్య.. త‌న భార్య కోసం గ్రీన్ కార్డును వదుల‌కోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. అమెరికాలో శాశ్వ‌త పౌర‌స‌త్వం కోసం గ్రీన్ కార్డు మంజూరు చేస్తార‌న్న విష‌యం తెలిసిందే. దీనికోసం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న‌ అన్ని ప్రపంచ దేశాల‌కు చెందిన పౌరులు అర్రులు చాస్తుంటారు. గ్రీన్ కార్డు ల‌బిస్తే అమెరికా పౌరుడిగా గుర్తింపు ల‌భిస్తుంది. అంతేకాకుండా వారి పిల్లలు ఆ గుర్తింపు పొందొచ్చు. ఇంత‌టి కీల‌క‌మైన గ్రీన్ కార్డును త‌న భార్య కోసం వ‌దులుకుని ఆమెపై త‌న ప్రేమ‌ను చాటుకున్నారు స‌త్య‌ నాదెళ్ల.

అదెలాగంటే.. 1993లో సత్యా నాదెళ్ల... అనూను వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత త‌న‌ భార్యను తనతో పాటు అమెరికా తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే అప్పుడున్న అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం గ్రీన్‌ కార్డ్‌ కలిగిన వారిని వివాహం చేసుకుంటే వారి భాగస్వామికి వీసా తిరస్కరిస్తారు. దీంతో సత్యతో కలిసి ఆమె అమెరికా రాలేకపోయారు. దీంతో భార్య కోసం - ఆమె ప్రేమ కోసం ఏకంగా గ్రీన్‌ కార్డ్‌ నే వదులుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు స‌త్య‌.అయితే హెచ్‌1బీ వీసా కలిగి అమెరికాలో పనిచేస్తుంటే వారి భాగస్వాములు (భార్య లేదా భర్త) అమెరికా వచ్చేందుకు అవ‌కాశం ఉంది. దీంతో గ్రీన్ కార్డును త్యజించి హెచ్‌1బీ వీసా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ్డాన‌ని స‌త్య త‌ను రాసిన పుస్త‌కంలో వివ‌రించారు.

అంద‌రూ గ్రీన్‌ కార్డు కోసం చూస్తుంటే తాను గ్రీన్ కార్డును వ‌దులు కోవ‌డంతో అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని ఆ సంగ‌తుల‌ను పుస్త‌కంలో గుర్తు చేశారు స‌త్య‌. 1994లో ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీకి వెళ్లి గ్రీన్‌ కార్డును తిరిగి ఇచ్చేసి, హెచ్‌1బి వీసాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే అక్కడున్న క్లర్క్ కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేశారంట‌. ఎందుకు గ్రీన్‌ కార్డును ఇచ్చేస్తున్నార‌ని క్ల‌ర్క్ అడిగితే ఇమ్మిగ్రేష‌న్ ఇబ్బందులను స‌త్య వివ‌రించార‌ట‌. దీంతో వారు హెచ్‌1బీ వీసా మంజూరు చేశారంట‌. హెచ్‌1బీ వీసా లభించడంతో తన భార్య తనతో కలిసి అమెరికాకు వచ్చిందని ఆ సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ఆనాటి నుంచి అంద‌రూ ఇమ్మిగ్రేష‌న్ నిబంధ‌ల కోసం త‌న‌ను సంప్ర‌దిస్తూ ఉండేవార‌ని చెప్పాడు ఈ టెక్నాల‌జీ దిగ్గజం.