Begin typing your search above and press return to search.

మెక్సికోలో పెను భూకంపం..216 మంది మృతి!

By:  Tupaki Desk   |   20 Sep 2017 10:49 AM GMT
మెక్సికోలో పెను భూకంపం..216 మంది మృతి!
X
అమెరికాను వ‌ణికించిన ఇర్మాను మ‌రువ‌క ముందే మెక్సికో ప్రకృతి విల‌య తాండ‌వం సృష్టించింది. మెక్సికోపై ప్రకృతి పంజా విసిరింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి మెక్సికో అత‌లాకుత‌ల‌మైంది. ఈ భూకంపంలో ఇప్ప‌టివ‌ర‌కు 216మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయ‌ప‌డ్డారు. భూకంప తీవ్ర‌త‌ను బ‌ట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశ‌ముంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. మోరిస్స్‌ రాష్ట్రంలో 70 , ప్యూబ్లలో రాష్ట్రంలో 43, మెక్సికో నగరంలో 86, దేశంలోని మిగిలిన ప్రదేశాల్లో 14 మంది, గ్యూర్రెరొ ప్రాంతంలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెక్సికోలో జాతీయ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించారు. ఆ దేశానికి అండ‌గా ఉంటామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.

మెక్సికోలోని ఓ ఎలిమెంట‌రీ పాఠ‌శాల భ‌వ‌నం కూలిపోవ‌డంతో 22 మంది చిన్నారులు మ‌ర‌ణించారు. ఇంకా 30 మంది పిల్ల‌ల జాడ తెలియ‌లేదు. ఆ శిథిలాల కింద మ‌రింత మంది ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. దేశంలో విద్యుత్తు, టెలిఫోన్‌ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో, దాదాపు 20 లక్షల మంది ప్ర‌జ‌లు అంధ‌కారంలో ఉన్నారు. మెక్సికోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటెన్సినో వ‌ద్ద‌ 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్నిగుర్తించినట్లు అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. పసిఫిక్‌ సముద్రంలోని దక్షిణ మెక్సికో ఉన్న కోకోస్‌ భూపలకం ఉత్తర అమెరికా భూపలకాన్ని ఢీకొనడంతో ఈ ప్రకంపనలు సంభవించినట్లు భావిస్తున్నారు. నెల రోజుల క్రితం కూడా మెక్సికోలో 8.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు 90 మంది మృతి చెందారు.

కాక‌తాళీయంగా, స‌రిగ్గా 32 ఏళ్ల క్రితం 1985 సెప్టెంబర్‌ 19న (మంగళవారం) కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో 10 వేల మంది వరకు మృతి చెందారు. ఆ నాటి ఘ‌ట‌న‌ను స్మ‌రించుకుంటూ భూకంపాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ ప్ర‌తి ఏటా మెక్సికో వీధుల్లో మాక్‌డ్రిల్స్‌ నిర్వహించ‌డం ఆన‌వాయితీ. ఆ మాక్ డ్రిల్ ముగిసిన‌ కొన్ని గంటలకే నిజ‌మైన భూకంపాన్ని హెచ్చరిస్తూ సైరన్లు మోగాయి.అయితే, చాలామంది ఆ సైర‌న్ల‌ను మాక్‌ డ్రిల్స్‌లో భాగమ‌నుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో, వారంతా శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఆ సైర‌న్ ల‌కు స‌రైన స‌మ‌యంలో స్పందించి ఉంటే మృతుల సంఖ్య త‌గ్గి ఉండేద‌ని అధికారులు భావిస్తున్నారు.

భూకంప ధాటికి తీవ్రంగా దెబ్బ‌తిన్న మెక్సికో నగరానికి మ‌రో ముప్పు పొంచి ఉంది. ఆ న‌గ‌రంలో నిర్మించిన భారీ గ్యాస్‌పైప్‌లైను ఇప్పుడు ప్రజలను క‌ల‌వ‌ర‌పెడుతోంది. గ్యాస్‌పైపులైన్‌లో లీక్‌ కారణంగానే భూకంప సమయంలో భారీ పేలుడు సంభవించింద‌ని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం వచ్చిన భూకంపంలో దెబ్బ‌తిన్న ఈ పైపులైను, తాజా భూకంపంతో మరింత నాశ‌నం అయింది. భూకంప స‌మ‌యంలో ఆటోమేటిక్‌గా వాల్వులు మూసుకుపోయే వ్యవస్థ ఉన్పటికీ పేలుడు సంభ‌వించింది. దీంతో, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆహారం వండుకునేందుకు వీధుల్లో మంటలు పెట్టవద్దని ప్ర‌భుత్వం హెచ్చరికలు జారీ చేసింది.