Begin typing your search above and press return to search.

రానున్న రోజుల్లో హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో

By:  Tupaki Desk   |   23 Sep 2019 6:53 AM GMT
రానున్న రోజుల్లో హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో
X
దేశంలో మరే మహానగరంలో లేని రీతిలో స్తంభాల మీద మెట్రోను పరుగులు తీయించటంతో హైదరాబాద్ మెట్రో రికార్డు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పడు ఎదురయ్యే సాంకేతిక సమస్యల మెట్రోకు పంటి కింద రాయిలా మారుతున్నాయి. అదే సమయంలో.. తాజాగా నిర్మాణ లోపంతో అమీర్ పేట మెట్రో పై భాగంలోని గోడ పెచ్చులూడి మూడో అంతస్తు నుంచి కింద పడటం.. సరిగ్గా అదే ప్రదేశంలో ఒక యువతి నిలబడి ఉండటంతో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది.

సిమెంటు పెళ్లలు ఆమె తల భాగం మీద పడటంతో ప్రాణాలు పోయిన పరిస్థితి. మెట్రో నిర్మాణం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మెట్రోను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు విస్తరించే ప్రణాళిక మీద ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోల్ కతా తరహాలో భూగర్భ మెట్రోను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం- శంషాబాద్ రూట్ లో ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ కు సన్నాహాలు షురూ చేయనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 31 కి.మీ. మార్గంలో శంషాబాద్ టౌన్ దగ్గర నుంచి విమానాశ్రయం టర్మినల్ వరకూ భూగర్భ మార్గంలో మెట్రో రైలును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను ఒకటి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పద్ధతిలో మెట్రోను ఏర్పాటు చేస్తే.. శంషాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్.. ల్యాండ్ అయ్యే విమానాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రోను విస్తరించటానికి రూ.4500 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇప్పడున్న పద్దతిలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాయదుర్గం నుంచి కనీసం 50 నుంచి నుంచి ట్రాఫిక్ అధికంగా ఉన్న వేళల్లో 1.15 గంటల వరకూ పడుతున్న పరిస్థితి. దీనికి భిన్నంగా కేవలం 25 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడున్న మోడల్ లో సరాసరిన ప్రతి కిలోమీటర్ కు ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయగా.. ఎయిర్ పోర్ట్ కు ఏర్పాటు చేసే మార్గంలో మాత్రం ప్రతి 5 కి.మీ. ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. రాయదుర్గం తర్వాత.. గచ్చిబైలి.. అప్పాజంక్షన్.. కిస్మత్ పూర్.. గండిగూడ చౌరస్తా.. శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే.. ఎయిర్ పోర్ట్ నుంచి సిటీకి మధ్య రవాణ సమయం దాదాపుగా తగ్గిపోవటమే కాదు.. ఎయిర్ పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడి నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉందని చెప్పక తప్పదు.