నిషిత్ కారు చూసి బెంజ్ ప్రతినిధులు ఏమన్నారు?

Fri May 19 2017 11:49:37 GMT+0530 (IST)

ఖరీదైన కార్లకు కేరాఫ్ అడ్రస్ గా.. రక్షణ వ్యవస్థల విషయంలో అమిత ప్రాధాన్యమిచ్చే జర్మనీ కార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ప్రతినిధుల బృందం ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నడిపిన కారును పరిశీలించారు. జర్మనీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రతినిధులతో పాటు జపాన్.. హాంకాంగ్.. ఢిల్లీ.. పుణెకు చెందిన బెంజ్ నిపుణుల బృందం నిషిత్ కారును ప్రత్యేకంగా పరిశీలించింది. పది మంది సభ్యులతో కూడిన బృందంతో పాటు ఒక న్యాయనిపుణుడు వెంట రాగా నిషిత్ కారు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని.. బెంజ్ షోరూంలో ఉన్న యాక్సిడెంట్ కారును క్షుణ్ణంగా పరిశీలించారు.

కారు ప్రమాదానికి గురై.. ఇద్దరు ప్రాణాలు పోయిన నేపథ్యంలో బెంజ్ కు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ హైదరాబాద్ పోలీసులు లేఖలు రాసిన నేపథ్యంలో ఈ బృందాన్ని కంపెనీ ప్రత్యేకంగా పంపింది. ప్రమాదం జరిగినప్పుడు రక్షించాల్సిన ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలిపోయాయి? సీటు బెల్ట్ ధరిస్తే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయా?

యాంటీ బ్రేకింగ్ సిస్టం ఎందుకు పని చేయలేదు? బ్రేకింగ్ సిస్టం ఎంత వేగం వరకూ పని చేస్తాయి? లాంటి సందేహాల్ని పోలీసులు వ్యక్తం చేశారు. వీటికి సమాధానాలు ఇచ్చేందుకు బెంజ్ బృందం హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా కారును పరిశీలించిన వారు.. ఇంత వేగంగా వాహనాన్ని నడిపారా? అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

అన్నింటికి మించి.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వారు.. ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో గంటకు 200కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడపటం ఏమిటన్న విస్మయాన్ని వ్యక్తం చేయగా.. ప్రమాదం జరిగిన సమయాన్ని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ప్రధాన రహదారిలో ఇంత వేగంతో డ్రైవ్ చేయటం చూసిన వారు.. అమ్మో అంత స్పీడా? అని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఎంత భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మితిమీరిన వేగం కాపాడలేదన్న అభిప్రాయాన్ని ప్రాథమికంగా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/