Begin typing your search above and press return to search.

వైఎస్‌ ను చూసైనా బాబు నేర్చుకోవ‌డం లేదు!

By:  Tupaki Desk   |   25 Jun 2017 9:53 AM GMT
వైఎస్‌ ను చూసైనా బాబు నేర్చుకోవ‌డం లేదు!
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప‌రిపాల‌న‌పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న‌ వ్యక్తిని అని మ‌ర‌చిపోయి ప్రజలను భయపెట్టే స్థాయికి రావడం ఆయన నియంత పోకడలకు నిదర్శనమని మేక‌పాటి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరినీ ఒకే విధంగా చూడాల్సిన వ్యక్తి వారి ఆస్తులను వారి భద్రతకు ధర్మకర్తగా ఉండాల్సిన సీఎం ప్రజాకంటకుడై ప్రజలను భక్షిస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేద‌ని, వీరిని ఇంటికి పంపించాల్సిన అవసరం వైఎస్‌ ఆర్‌ సీపీ కార్యకర్తలపై ఉందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపీ మేకపాటి మాట్లాడుతూ చంద్ర‌బాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యవహారశైలికి బుద్ధిచెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆరు వందల హామీలను ఇచ్చి, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేని ఘ‌నుడు చంద్ర‌బాబు అని మేక‌పాటి మండిప‌డ్డారు. పైగా రాజ్యాంగాన్ని అప‌హాస్యం పాలు చేసేలా ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సినంత శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పటికీ వైఎస్‌ ఆర్‌ సీపీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కొని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఊరేగిస్తున్నారని విమర్శించారు. ఎన్‌ టిఆర్ లాంటి గొప్ప వ్యక్తిని చంద్రబాబునాయుడు వెన్నుపోటుతో ద్రోహం చేశాడని, పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన‌ వ్యక్తి ప్రజలను మోసం చేయడం గొప్ప వింతేమి కాదన్నారు. ఎన్‌ టి రామారావు మరణానికి కూడా చంద్రబాబునాయుడు పెట్టిన క్షోభే కారణమని, ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణానికి చంద్రబాబునాయుడే కారణమని ఎంపీ ఆరోపించారు. ఎన్‌ టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ను అవినీతి ప్రదేశ్‌ గా తయారుచేస్తున్నాడని ఆయన విమర్శించారు.

2019 ఎన్నికల్లో వైఎస్‌ ఆర్‌ సీపీని గెలిపించుకొని జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న నాడే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని మేక‌పాటి తెలిపారు. ప్రస్తుతం వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 46 మంది ఎమ్మెల్యేలు తిరిగి బ్రహ్మాండంగా గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన్ని స్వర్ణ యుగంగా పోలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్‌ రెడ్డి చేసిన పనులు చూసైనా చంద్రబాబునాయుడు నేర్చుకుంటాడంటే అది కూడా చేయడం లేదన్నారు. 2019 ఎన్నికల్లో చిన్న పొరపాటు కూడా చేయకూడదని, అతి విశ్వాసం విడనాడాలని ఆయన సూచించారు. జిల్లాలో పది శాసనసభ - రెండు ఎంపి స్థానాలు గెలిచి తీరాలని, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి శక్తికి మించి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. రాబోవు ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోని పక్షంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందని, ప్రజాస్వామ్యం అనేది పునాదులతో కూలగొట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అందుకే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేయాల‌ని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/