Begin typing your search above and press return to search.

నాకు భార‌త్‌ పౌర‌స‌త్వం వ‌ద్దు...పారిపోయిన వ్య‌క్తి సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   21 Jan 2019 9:23 AM GMT
నాకు భార‌త్‌ పౌర‌స‌త్వం వ‌ద్దు...పారిపోయిన వ్య‌క్తి సంచ‌ల‌నం
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన 14 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ ప్రస్తుతం కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ వ్యాపార విస్తరణ కోసం తాను ఆంటిగ్వా పౌరసత్వం కూడా తీసుకున్నట్లు అతడు గతంలోనే చెప్పాడు. ఇప్పుడతను దేశం వదలి పారిపోకుండా చూడాలని ఆంటిగ్వాను ఇండియా కోరింది. మెహుల్ చోక్సీని తమకు అప్పగించాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని భారత రాయబారి కోరారు. అయితే, ఈ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్న అతడు.. గతేడాదే అక్కడి పౌరసత్వం తీసుకున్న నేప‌థ్యంలో ఆ దేశ పౌరుడిగా ఉండేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో నీరవ్ మోదీతోపాటు అతని మేనమామ అయిన ఈ మెహుల్ చోక్సీ కూడా నిందుతుడైన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం బయటపడే సమయానికే ఈ ఇద్దరూ దేశం వదిలి వెళ్లిపోయి ఆంటిగ్వాలో నివ‌సిస్తున్నాడు. ఆంటిగ్వా పౌరుడిగా ఉండేందుకు గాను తన పాస్‌పోర్ట్‌ను ఆంటిగ్వా అధికారులకు చోక్సీ ఇచ్చేశాడు. దీంతోపాటు భారత పౌరసత్వం వదులుకోవడానికి చెల్లించాల్సిన 177 డాలర్ల మొత్తాన్ని కూడా అతడు అధికారులకు చెల్లించాడు. అతని పాస్‌పోర్ట్ నంబర్ జెడ్.3396732గా ఉంది. కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి అమిత్ నారంగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత పౌరసత్వాన్ని వదులుకుంటూ తన సొంతిల్లు ఆంటిగ్వాలోని జాలీ హార్బర్‌గా పేర్కొన్నాడు. తాను ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్న కారణంగా నిబంధనల ప్రకారం భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు అతను అధికారులకు చెప్పాడు.

2017 నవంబర్‌లోనే చోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం వచ్చింది. పీఎన్‌బీ స్కాం బయటపడటానికి కేవలం 15 రోజుల ముందు అంటే.. 2018 జనవరి 15న మెహుల్ చోక్సీ ఆ పౌరసత్వాన్ని స్వీకరించాడు. ఈ ఆంటిగ్వా పాస్‌పోర్ట్ ద్వారా అతనికి 130 దేశాల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది. పీఎన్‌బీ స్కాంలో చోక్సీతోపాటు అతని మేనల్లుడు నీరవ్ మోడీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండ‌గా, ఆంటిగ్వా పౌరసత్వం తీసుకోవడం వల్ల అతడు ఇండియాకు తిరిగి రాకుండా ఉండాలని భావిస్తున్నాడు. ఆంటిగ్వాలోనే భారత్‌కు అప్పగింతపై ఫిబ్రవరి 22న విచారణ జరగనుంది.