Begin typing your search above and press return to search.

అలా చేస్తే క‌శ్మీర్ మ‌రో సిరియానే: మెహ‌బూబా

By:  Tupaki Desk   |   22 July 2017 5:29 PM GMT
అలా చేస్తే క‌శ్మీర్ మ‌రో సిరియానే: మెహ‌బూబా
X
కశ్మీర్‌ విషయంలో అమెరికా - చైనాలు జోక్యం చేసుకోవ‌లంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెల‌సిందే. ఈ వ్యాఖ్యలను పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఫ‌రూక్ అబ్దుల్లా వ్యాఖ్య‌ల‌ను జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. కశ్మీర్‌ విషయంలో అమెరికా వంటి దేశాలు తలదూరిస్తే కశ్మీర్‌ మరో సిరియా అవుతుందని వ్యాఖ్యానించారు.

అమెరికా - చైనా వంటి దేశాలు క‌శ్మీర్ అంశంలో తలదూరిస్తే కశ్మీర్‌ లోయ మరో సిరియాగానో, అఫ్ఘానిస్థాన్ గానో మారుతుందన్నారు.‘చైనా - అమెరికాల‌ను వారి పనిని వారు చూసుకోమనండి. వాళ్లు మధ్యవర్తిత్వం వహించిన అఫ్గానిస్తాన్‌ - సిరియా - ఇరాక్‌ పరిస్థితేంటో మన కళ్లముందే కనిపిస్తోంది’ అని మెహ‌బూబా ముఫ్తీ అన్నారు. అఫ్ఘానిస్థాన్ - సిరియాలో ఏం జరుగుతోందో ఫరూక్‌ కు తెలుసా? అని ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఇరు దేశాలు కలిసి చర్చించుకోవడం ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కాగా, కశ్మీర్‌ అంశంపై ఫరూక్‌ అబ్దుల్లా శుక్ర‌వారం సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. సమస్య పరిష్కారానికి ‘మూడో వ్యక్తి’జోక్యం అవసరమని, మధ్యవర్తిత్వంతోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని కేంద్రానికి సూచించారు.‘మధ్యవర్తిత్వం అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తానని అమెరికా అధినేత ట్రంప్ అన్న‌ప్ప‌టికీ మనం సిద్ధంగా లేం. అలాగే చైనా కూడా ముందుకొచ్చినా, మనం అంగీకరించడం లేదు’అని అన్నారు. ‘పాక్‌కు అణు బాంబులు ఉన్నాయి.. మీకు(భారత్‌) ఉన్నాయి. దీనివల్ల ఎంత మంది చనిపోవాలి’అని ఆయ‌న‌ ప్రశ్నించారు. కశ్మీర్‌ సమస్యకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ట్రంప్‌ నేరుగా ఎక్కడా అనల‌దు. కానీ, ఐక్యరాజ్యసమితిలోని యూఎస్‌ రాయబారి నిక్కీ హెలీ ఏప్రిల్‌లో ఈ వాఖ్యలు చేశారు. వాటిని ఆధారం చేసుకుని ఫ‌రూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్య‌లు చేశారు.