Begin typing your search above and press return to search.

అంద‌రి నోట ష‌యరా బానో.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 Aug 2017 4:56 PM GMT
అంద‌రి నోట ష‌యరా బానో.. ఎందుకంటే?
X
త‌లాక్‌.. మూడు అక్ష‌రాల మాట‌ను.. మూడుసార్లు ఉచ్ఛ‌రిస్తే చాలు.. ఒక మ‌హిళ వైవాహిక జీవితం అంత‌మైన‌ట్లే. ఏళ్ల‌కు ఏళ్లు కాపురం చేసినా.. స‌ద‌రు భ‌ర్త‌కు భార్య ఎంత‌మాత్రం న‌చ్చ‌కున్నా.. త‌లాక్ ప‌దాన్ని మూడుసార్లు ఉచ్ఛ‌రిస్తే అంతే వైవాహిక బంధం ముగిసిన‌ట్లే. మిగిలిన ప్ర‌క్రియ అంతా సాంకేతిక‌మే. ఇదంతా విన్న‌ప్పుడు.. ఈ డిజిట‌ల్ యుగంలో ఇంత సింఫుల్ గా ఒక బంధానికి మంగ‌ళం పాడించేయొచ్చా? అన్న సందేహం క‌ల‌గొచ్చు. కానీ.. ఇది నిజ‌మ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ముస్లింల‌కు ర‌క్ష‌గా నిలిచే త‌లాక్ నియ‌మాన్ని 22 ముస్లిం దేశాలు ర‌ద్దు చేయ‌టం గ‌మ‌నార్హం. ఒక లౌకిక దేశంలో మ‌తానికి సంబంధించిన ఒక విష‌యం మీద ఇంత క‌ఠిన నియమం ఉంటే.. మ‌త ప్రాతిప‌దిక‌గా ఏర్ప‌డిన దేశాల్లో ఇలాంటి నియామ‌కాన్ని ర‌ద్దు చేసినా.. భార‌త్ లో మాత్రం ఇది అమ‌ల‌వుతూనే ఉంది. ఇలాంటి వేళ ష‌య‌రా బానో అనే ముస్లిం మ‌హిళ పుణ్య‌మా అని ట్రిపుల్ త‌లాక్ మీద ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ట్రిపుల్ త‌లాక్ పై ఆర్నెల్లు నిషేధం విధించ‌ట‌మే కాదు.. ఈ కాలంలో కేంద్రం ఒక చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని ఆదేశించింది. ఈ నిర్ణ‌యంపై ముస్లిం మ‌హిళ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. ట్రిపుల్ త‌లాక్ నియ‌మానికి చాలామంది మ‌హిళ‌ల జీవితాలు బుగ్గి అయిపోయిన ప‌రిస్థితి. ష‌య‌రా బానో త‌ర‌హాలో కోర్టును ఆశ్ర‌యించినా.. ఎవ‌రి కేసులు నిల‌వ‌లేదు. కానీ.. ష‌య‌రా బానో వేసిన కేసు మాత్రం నిల‌వ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు సంచ‌ల‌న తీర్పు వ‌చ్చేలా చేసింది. ఇంత‌కీ ష‌య‌రా బానో ఎవ‌రు? ఆమె ఎందుకు కేసు వేశారు? మిగిలిన బాధిత మ‌హిళ‌ల కేసులు నిల‌వ‌కుండా.. ష‌య‌రా బానో వేసిన కేసు ఎందుకు నిల‌బ‌డింది? స‌ంచ‌ల‌న తీర్పు ఎందుకు వ‌చ్చింది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ట్రిపుల్ త‌లాక్ మీద ఇంత చ‌ర్చ జ‌ర‌గ‌టానికి కార‌ణ‌మైన ష‌యారా బానోది ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్‌కు చెందిన ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి ముస్లిం మ‌హిళ‌. సోషియాల‌జీలో పీజీ చేసిన ఆమెకు 2001లో పెద్ద‌లు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. కొన్ని రోజుల‌కే మ‌రింత క‌ట్నం కావాలంటూ బానోకు వేధింపులు మొద‌ల‌య్యాయి. క‌ట్నం తేలేద‌న్న కోపంతో బానోను ఆమె కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌వ‌నిచ్చేవారుకాదు. ఇదే స‌మ‌యంలో ఆమెకు ఒక అబ్బాయి.. అమ్మాయి పుట్టారు. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కూడా బానో భ‌ర్త‌లో మార్పు రాలేదు. ఎక్కువ మంది పిల్ల‌ల్ని పోషించ‌లేనంటూ ఆరేడుసార్లు బానోకు అబార్ష‌న్ చేయించారు.

ఇంత జ‌రిగిన త‌ర్వాత పెళ్లి అయిన 14 ఏళ్ల‌కు బానోను పుట్టింటికి పంపారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు పిల్ల‌ల్ని త‌న వెంట తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత పోస్ట్ లో ఆస్తి పంప‌కాల కాగితాలు త్వ‌ర‌లో పంపుతాన‌ని చెప్పి వెళ్లిపోయాడు. ఓ రోజు వ‌చ్చిన స్పీడ్ పోస్ట్ లో తెరిచి చూస్తే.. అందులో తలాక్.. త‌లాక్‌.. త‌లాక్ అని రాసి ఉంటుంది. దీంతో తీవ్ర‌మైన వేద‌న‌కు గురైన ఆమె ముస్లిం మ‌త పెద్ద‌ల‌కు వెళితే ఆ త‌లాక్ చెల్లుతుంద‌న‌టంతో ఆమె షాక్ తిన్నారు. ఆ త‌ర్వాత లాయ‌ర్ తో మాట్లాడిన ఆమె న్యాయ‌పోరాటానికి దిగారు.

అలా మొద‌లైన ఆమె న్యాయ‌పోరాటం ఒక రూపుకు వ‌చ్చేస‌రికి 2016 ఏడాది వ‌చ్చింది. ఆ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు బానో. ఏక‌ప‌క్షంగా ఉన్న ట్రిపుల్ త‌లాక్‌ను నిషేధించాల‌ని ఆమె కోరారు. మొద‌టి భ‌ర్త‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలంటే మ‌ధ్య‌లో మ‌రో పురుషుడ్ని పెళ్లాడి.. అత‌డికి విడాకులు ఇచ్చి రావాల‌నే నిఖా హ‌లాలాను ర‌ద్దు చేయాల‌ని.. ముస్లిం పురుషుల బ‌హు భార్య‌త్వ హ‌క్కుల‌ను కోరారు. మ‌రో కీల‌క‌మైన విష‌యాన్ని ఆమె తెర మీద‌కు తీసుకొచ్చారు.

అదేమంటే.. చ‌ట్టం ముందు స్త్రీ.. పురుషులు స‌మాన‌మ‌న్న‌ది ప్రాథ‌మిక రాజ్యాంగ హ‌క్కు అన్న విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు. బానోకు ముందు త‌లాక్ మీద న్యాయ‌పోరాటం చేసిన వారంతా హిందువుల‌కు.. ముస్లింల‌కు ఉమ్మ‌డి పౌర‌స్మ‌తి అమ‌లు చేయటం ద్వారానే న్యాయం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కానీ.. బానో మాత్రం అందుకు భిన్నంగా.. మ‌హిళ‌ల ప్రాథ‌మిక రాజ్యాంగ హ‌క్కును ప్ర‌స్తావించ‌టం.. విష‌యాన్ని త‌లాక్ ప‌రిధి దాట‌కుండా చూశారు. దీంతో.. ఆమెకు మ‌ద్ద‌తుగా ప‌లువురు అండ‌గా నిలిచార‌ని చెప్పాలి.

ముస్లిం వివాహ చ‌ట్టం ప‌ట్ల ముస్లిం మ‌హిళ‌ల వైఖ‌రి మారుతుంద‌న‌టానికి బానో కేసు మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జైపూర్ కు చెందిన ఆఫ్రీన్ ర‌హ‌మాన్ స్పీడ్ పోస్ట్ ద్వారా త‌న‌కు త‌లాక్ చెప్పిన భ‌ర్త‌పై సుప్రీంలో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ద‌శ‌లో అఖిల భార‌త ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు అధ్య‌క్షురాలు షాయిస్ట అంభ‌ర్ త‌లాక్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం.. ఆ త‌ర్వాత భార‌తీయ ముస్లిం మ‌హిళా ఆందోళ‌న్ కూడా బానోకు అండ‌గా నిలుస్తూ కేసులో ఇంప్లీడ్ అయ్యారు.

అనంత‌రం దేశ వ్యాప్తంగా ట్రిపుల్ త‌లాక్‌ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించ‌టం.. 50వేల‌కు పైగా సాధార‌ణ మ‌హిళ‌ల నుంచి సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. బానో తీరుకు స్పందించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సైతం ఆమెకు త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండగా కేంద్రం సైతం ట్రిపుల్ త‌లాక్‌కు వ్య‌తిరేకంగా వాదించ‌టంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం 3:2 నిష్ప‌త్తితో త‌లాక్ విధానానికి నిషేధాన్ని విధించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ముస్లిం మ‌హిళ‌లు తాజా తీర్పు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.