Begin typing your search above and press return to search.

‘చీపురు’ పార్టీ కాస్తా.. ‘గూండా’ పార్టీ అవుతోందా?

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:41 AM GMT
‘చీపురు’ పార్టీ కాస్తా.. ‘గూండా’ పార్టీ అవుతోందా?
X
చీపురును పార్టీ గుర్తుగా పెట్టుకున్నప్పుడు దాదాపుగా ప్రతి సామాన్యుడూ సంతోషించాడు. రాజకీయాల్లో ఉన్న చెత్తను ఊడ్చేయడానికే వస్తున్నా.. అనే ఓ సినిమా డైలాగులాగా.. భారత ప్రభుత్వ అధికారిగా ఉంటూ.. ముందు సామాజిక సేవారంగంలోకి తరవాత రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తనది సామాన్యుడి పార్టీ అనే నినానదంతో ‘ఆమ్ ఆద్మీ’ ని స్థాపించినప్పుడు.. దానికి ఈ ‘చీపురు’ సరైన గుర్తు అని చాలా మంది అనుకున్నారు. తొలిరోజుల్లో కేజ్రీవాల్ కు దక్కిన గుర్తింపు కూడా అంతకంటె ఎక్కువే. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికే ఆయన ఈ చీపురుతో రంగప్రవేశం చేస్తున్నారని ఢిల్లీ ప్రజలు కుతూహలం ప్రదర్శించారు.

ఆయనకు కనీసం రెండోసారి పూర్తి మెజారిటీని అందించారు. ఏమైంది? ఏళ్లు గడిచేసరికి.. ఆయన మీద పెట్టుకున్న ఆశలు కూడా తేలికగానే ఆవిరైపోయాయి. ఆయన పార్టీ కూడా అన్ని సాంప్రదాయ పార్టీలలాగానే తప్పులు చేస్తుందని, అందులో కూడా అవకతవకలకు నిలయమైన నాయకులూ ఉంటారని.. ఏ రకంగానూ అది విభిన్నమైన, దేశంలో రోల్ మోడల్ గా నిలవగల పార్టీ కాబోదని అనేక ఉదాహరణలు నిరూపించాయి. అరవింద్ కేజ్రీవాల్ చిత్తశుద్ధి గల, అవినీతి జోలికి వెళ్లని నాయకుడే కావచ్చు గాక.. కానీ.. ఆయన పార్టీ మొత్తం, ఆయన ప్రభుత్వం మొత్తం అలాంటిదే అని సంతోషించడానికి వీల్లేదని అనేక పరిణామాలు నిరూపించాయి.

‘సేన చెడుగైన దండనాధుని తప్పు’ అని నరసింహ శతకం లోని ఓ నీతిపద్యం చెబుతుంది. అంటే ఏమిటి? నీ జట్టులోని వాళ్లంతా తప్పుడు మనుషులు అంటే.. అలాంటి వాళ్లే నీ జట్టులో హోదాలను, పదవులను అనుభవిస్తున్నారంటే.. అదంతా నీ అసమర్థత కిందికే వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీ ఒక్కడి నిజాయితీ జాతికి అనవసరం. నిన్నునాయకుడిగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు నీ వెంట ఉండే వారంతా నీలాంటి నిజాయితీ పరులుగానే ఉండాలని కోరుకోవడం ప్రజల అత్యాశ కాదు కదా..! ఈ చిన్న లాజిక్ ను కేజ్రీవాల్ మిస్సయ్యారు.

లేకపోతే.. సీఎం ఇంటిలో, ఆయన సమక్షంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద ఇద్దరు ఎమ్మెల్యేలు దాడిచేసి.. విచక్షణ రహితంగా కొట్టడం అనేది ఎలా జరుగుతుంది? గాయపడిన చీఫ్ సెక్రటరీ గాయాలు మరియు మెడికల్ రిపోర్టుతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఆప్ చాలా మామూలు రాజకీయ పార్టీలాగా ఈ దాడి ఆరోపణలను ఖండించి, ఎమ్మెల్యే అరెస్టుకు నిరసన వ్యక్తం చేసింది. మామూలు అందరు నేతల్లగా కేజ్రీవాల్ దీనిపై స్పందించలేదు.

ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆప్ వ్యవహరించాల్సిన పద్ధతి కాదు. ఇది. ఇప్పటకైనా కేజ్రీవాల్ ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఆరోపణలు తప్పు అని చట్టపరంగా తేలిన తర్వాత.. తిరిగి వారిని పార్టీలోకి తీసుకుంటే.. పార్టీ పరువు, తన పరువు కాపాడుకున్న వారు అవుతారు. లేకపోతే.. ‘చీపురు’ పార్టీ కాస్తా.. ‘గూండా’ పార్టీగా మారిందని ప్రజలంతే ఎద్దేవా చేసే ప్రమాదం ఉంది.