రోగం గుట్టును బయటపెట్టిన ఏపీ ప్రభుత్వం

Tue Jun 19 2018 17:21:00 GMT+0530 (IST)

చంద్రబాబు తీసుకొచ్చిన పారదర్శకత ఏపీ ప్రజల వ్యక్తిగత సమస్యను హరిస్తోంది. పౌరుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం ప్రభుత్వ యంత్రాంగం విధి. కానీ ఏపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ చేస్తూ వారి జీవితాలను రోడ్డున పడేస్తోంది. ఆ డేటాతో కొందరు సొంత వ్యాపారాభివృద్ధికి - ఇతర అవసరాలకు వాడుకునే ప్రమాదం ఏర్పడడంతో ఇప్పుడు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వం ‘సీఎం డ్యాష్ బోర్డు’ పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇందులో పౌరులు వ్యక్తిగతంగా చేసే ఔషధాల కొనుగోళ్ల వివరాలు పెడతారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ అన్న సంజీవనీ’ స్టోర్లల్లో జరిగే కొనుగోళ్ల వివరాలను ఈ డ్యాష్ బోర్డు వెబ్ సైట్ లో ప్రతిరోజు పెట్టేస్తున్నారు. దీంతో ఎవరికి ఏ రోగాలున్నాయి.. వారికి రోగం తీవ్రత ఏంటనేది అందరూ చూడవచ్చు. ఇదే వారి ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది.

అయితే వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని .. వారి మందుల వివరాలు సహా అన్నీ వెబ్ సైట్ లో పెడుతుండడంతో ఇది విమర్శల పాలైంది. ఇలా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం పరచడం మంచిది కాదని.. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్య సీక్రెట్స్  బయటపడతాయని.. వ్యక్తుల భద్రతకు ముప్పు అని ఓ ఆంగ్ల వెబ్ సైట్ లో ఇటీవల కథనం వెలువడింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రజలు కొన్న మందుల వివరాలను డిలేట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం వెబ్ సైట్ లో రోగి మందుల వివరాలను చూస్తే నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తోంది. ఇలా ప్రభుత్వం చేసిన ఆదర్శ పని కాస్తా అభాసుపాలైంది.