జగన్- కేటీఆర్ భేటీతో చానళ్లకు అసలుసిసలు సంక్రాంతి

Wed Jan 16 2019 15:09:49 GMT+0530 (IST)

పండగ వచ్చిందంటే అందరికి సంతోషమే. కానీ.. ఒక్కరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఇంతకీ వాళ్లు ఎవరంటారా? ఇంకెవరు న్యూస్ చానళ్లు. నిత్యం ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంటే.. వారికి ఎలాంటి పనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. పండగలు వచ్చినప్పుడు మాత్రం రాజకీయంగా ఎలాంటి కదలిక లేకపోవటం.. నిత్యం జరిగే యాక్టివిటీస్ కూడా తగ్గిపోవటంతో న్యూస్ కు మహా కొరతగా మారుతుంది.టీవీల్లో ఆసక్తికర అంశాలు ఉంటే తప్పించి బండి లాగించలేని పరిస్థితి. ఇక.. సంక్రాంతి లాంటి మూడు రోజుల పండుగ వచ్చిందంటే.. రెగ్యేలర్ న్యూస్ ఐటమ్స్ కూడా తగ్గిపోతాయి. దీంతో.. ఆసక్తికర అంశాల సంగతి తర్వాత.. కనీసం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే వార్తలు లేక అల్లాడిపోతుంటారు. పండగ వేళల్లో సెలవు తీసుకోకుండా పని చేయటానికి ఒప్పుకున్నోళ్లకు చుక్కలు కనిపించే పరిస్థితి.

సరైన న్యూస్ లేక.. ప్రేక్షకుల దృష్టిని అలా కట్టి పారేసే అంశాల్ని వెతక లేక కిందా మీదా పడే చానళ్ల పరిస్థితి ఇంచుమించు ఆకలితో నకనకలాడే పరిస్థితి . ఇలాంటివేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన అధినేతలు ఇద్దరు కలుస్తారన్న విషయానికి మించిన బ్రేకింగ్ న్యూస్ ఏముంటుంది?  అందుకే.. పండగ మత్తును ఒక్కసారి వదిలించుకొని.. పరుగులు తీస్తున్న పరిస్థితి. మొత్తంగా గడిచిన మూడు రోజులగా సరైన ఫీడ్ లేకుండా నీరసంగా ఉన్న చానళ్లకు జగన్-కేటీఆర్ భేటీ కొత్త ఊపును.. ఉత్సాహాన్ని ఇచ్చింది. మొత్తంగా చూస్తే ఈ ఇద్దరు అధినేతల భేటీ నే న్యూస్ చానళ్లకు అసలుసిసలైన  సంక్రాంతిగా చెప్పక తప్పదు.