Begin typing your search above and press return to search.

బంగారంపై ఈ మీడియా గోలేందిరా బాబు..?

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:05 AM GMT
బంగారంపై ఈ మీడియా గోలేందిరా బాబు..?
X
నల్లధనంపై చర్నాకోల్ విసిరిన మోడీ సర్కారు.. రానున్న రోజుల్లో ఇంట్లోఉన్న బంగారం మీద పడిపోతున్నారంటూ సాగుతున్న ప్రచారం.. ఇప్పుడు రచ్చ.. రచ్చగా మారి.. ఏ ఛానల్ చూసినా.. బంగారం మీదనే చర్చ అన్నట్లుగా సాగుతోంది. బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటి? గతానికి ఇప్పటికి మధ్యతేడా ఏంటి?.. కొన్ని మీడియా సంస్థల్లో వండి వార్చేస్తున్న వార్తల్లో తప్పులు ఉన్నాయా? నిజంగానే బంగారం మీద అంత రచ్చ అవసరమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని పట్టి పీడిస్తున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బంగారం మీద మీడియాలో వస్తున్న ప్రత్యేక కథనాలు.. అభిప్రాయ సేకరణలు.. మహిళలు కనిపిస్తే చాలు.. వాళ్ల నోటి ముందుకు మైకులు పెట్టేసి మరీ.. తిట్టించేస్తున్న వైనంపై ఇప్పుడు పలువురు గుస్సా అవుతున్నారు. తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ.. మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా వ్యవహరిస్తున్న వైనంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యన లోక్ సభ ఆమోదం పొందిన ఐటీ చట్టంలో బంగారంపై కొత్త పరిమితులు లేకున్నా.. బంగారం మీద ఏదో జరిగిపోతున్నట్లుగా వార్తలు వచ్చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇంచుమించు కిలో వరకూ బంగారం ఉన్నా ఫర్లేదని.. అంతకుమించిఉన్న వారికి.. అది కూడా సరైన పత్రాలు లేని వారికి.. అంతులేని సంపద పోగేసుకున్న వారికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి సామాన్య.. మధ్యతరగతి ప్రజలకు అపాదిస్తూ.. మీడియా ప్రతినిధులు పలువురు చెప్పిస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సోషల్ మీడియా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు.

ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా ప్రచారం చేస్తూ.. బంగారం మీద ప్రధాని మోడీ ఏదో చేసేస్తున్నారన్న వాతావరణాన్నిక్రియేట్ చేయటం ఏ మాత్రం సరికాదన్న వాదన వ్యక్తమవుతోంది. ఒక ఇంట్లోని గృహిణికి 500గ్రాములు.. పురుషుడికి వంద గ్రాములు.. పెళ్లి కాని పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పావు కేజీ చొప్పున బంగారం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోదని చెబుతున్నా.. ఆ విషయాన్ని చెప్పకుండా..విషయం మీద సరైన అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్న మాట పలువురు వ్యక్తం చేస్తున్నారు. మోడీ మీద మీడియా కత్తి కట్టినట్లుగా.. బంగారం అంశాన్ని తెర మీదకు తెచ్చారని.. మహిళల్లో ఉన్న సెంటిమెంట్ ను తట్టి లేపటం ద్వారా.. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు కానీ మీడియా సంస్థలు (అన్నీ కావు కొన్ని మాత్రమే) కానీ తమ ధోరణిని మార్చుకోకపోతే.. వారిపై నమ్మకం పూర్తిగా పోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/