Begin typing your search above and press return to search.

నీచుడు అని తిట్టాక‌.. వివ‌ర‌ణ ఇచ్చాడే!

By:  Tupaki Desk   |   16 Oct 2018 4:57 AM GMT
నీచుడు అని తిట్టాక‌.. వివ‌ర‌ణ ఇచ్చాడే!
X
మ‌నుషుల‌న్నాక త‌ప్పులు చేస్తుంటారు. అంత మాత్రాన అదే ప‌నిగా త‌ప్పులు చేయ‌టం ఏ మాత్రం మంచిది. కాదు. ఈ మ‌ధ్య‌న ఏమైందో కానీ.. మీడియా త‌ర‌చూ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తోంది. ఓ వైపు సోష‌ల్ మీడియా చెల‌రేగిపోతూ.. మీడియా కంటే మ‌స్తు హుషారుగా ఉన్న వేళ‌.. త‌ప్పుల త‌డ‌క లేకుండా.. గాలిని పోగేసిన‌ట్లుగా కాకుండా కాస్తంత బాధ్య‌త‌గా రాస్తార‌న్న పేరు మీడియాకు అంతో ఇంతో ఉంది.

ఈ మ‌ధ్య‌న అదే ప‌నిగా దొర్లుతున్న త‌ప్పుల పుణ్య‌మా అని.. ఉన్న కాస్త పేరు సైతం సంక నాకిపోయేలా ఉంది. ఎవ‌రైనా ప్ర‌ముఖుడు ఏదైనా వ్యాఖ్య చేస్తే.. దాన్ని ట్విస్ట్ చేసి రాయ‌కుండా.. వారేం అన్న‌రో య‌థాత‌ధంగా రాసి పారేస్తే అన‌వ‌స‌ర‌మైన సౌండ్ పొల్యుష‌న్ త‌గ్గుతుంది. గ‌తంలో మాదిరి ప‌రుగులు పెట్టి పుస్త‌కంలో రాసుకోవాల్సిన క‌ష్టం కూడా లేదు. చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఒక్క స్విచ్ నొక్కితే చాలు.. మాట‌లు మొత్తం రికార్డు అయ్యే ప‌రిస్థితి.

ఆ ఆడియో క్లిప్ ను జాగ్ర‌త్త‌గా వింటూ రాసేస్తే.. త‌ప్పుల‌కు ఛాన్సే లేదు. అలాంటిది ఈ మ‌ధ్య‌న నేత‌లు చెప్పే మాట‌ల‌కు సంబంధం లేకుండా రాత‌లు రాయ‌టం.. అవి కాస్తా వివాదంగా మారిన త‌ర్వాత‌.. స‌ద‌రు ప్ర‌ముఖులు ఇచ్చే వివ‌ర‌ణ‌ల‌తో వార్త‌ల్ని అచ్చేయ‌టం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన ఒక వివాదాన్ని చూసిన‌ప్పుడు.. మీడియా కార‌ణంగా లేని పోని ర‌చ్చ జ‌రిగిందే అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కీ ఆ ఇష్యూ ఏమంటే.. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణంపై కాంగ్రెస్ నేత‌.. మాజీ కేంద్ర మంత్రి శ‌శిథ‌రూర్ కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌టం.. వాటిని పోస్ట్ చేయ‌టంతో ఇష్యూ వివాదాస్ప‌ద‌మైంది.

ఇంత‌కీ శ‌శిథ‌రూర్ అన్న మాటేంటి? దానికి మీడియాలోని కొంద‌రు అచ్చేసిందేమిట‌న్న‌ది చూస్తే.. బాబ్రీ మ‌సీదు స్థ‌లంలో ఆల‌యాన్ని నిజ‌మైన హిందువు ఎవ‌రూ కోరుకోర‌న్న మాట‌ను శ‌శిథ‌రూర్ చెప్పిన‌ట్లుగా మీడియాలో వ‌చ్చింది. దీనిపై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి రియాక్ట్ అయ్యారు. అయోధ్య గుడి మీద కేసులున్న శ‌శి అన్నేసి మాట‌లు అంటావా? బాంచ‌న్ దొర అన్న‌ట్లు ప‌డి ఉండాలే కానీ.. ఇలా మాట్లాడ‌తావా? నీ అంత నీచుడు ఉన్నాడా? అంటూ సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫైర్ అయ్యారు.

అస‌లే స్వామి.. దానికి తోడు సీరియ‌స్ అయి ఆగ్ర‌హంతో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట ఎంత మంటెత్తిస్తుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇందుకు శ‌శిథ‌రూర్ సైతం మిన‌హాయింపు కాదు. దీంతో.. స్వామి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డిన శ‌శి.. అస‌లేం జ‌రిగిందో తెలిసే మాట్లాడుతున్నావా? అంటూ క్లాస్ పీకే ప్ర‌య‌త్నం చేశారు.

తాను పాల్గొన్న హిందూ లిట్ ఫ‌ర్ లైఫ్ డైలాగ్ 2018లో మాట్లాడుతూ.. నిజానికి రాముడు పుట్టిన స్థ‌లం కావ‌టంతో ఎక్కువ మంది హిందువులు ఆల‌య నిర్మాణం కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. అంతేనా.. మ‌రో ఆరాధ‌నా ప్రాంతాన్ని ధ్వంసం చేసి అక్క‌డ దేవాల‌యం క‌ట్టాల‌ని నిజ‌మైన‌ హిందువు కోరుకోరంటూ తాను వ్యాఖ్యానించాన‌ని.. కానీ త‌న మాట‌ల‌కు భిన్నంగా మీడియా సంస్థ‌ల్లో ట్విస్ట్ చేసి రాశార‌ని పేర్కొన్నారు.

మీడియా త‌న మాట‌ల‌ను కొంద‌రు కావాల‌ని వ‌క్రీక‌రించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదంతా విన్న‌ త‌ర్వాత‌.. మీడియా వారు కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర ప‌ని చేస్తే.. ఈ త‌ర‌హా చెత్త వాద‌న అంతా ఏమీ ఉండేది కాదు క‌దా? అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. స్వామి అయినా నోరు పారేసుకునేట‌ప్పుడు కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడ‌టం.. తాను అనే మాట వెనుక అస‌లు నిజం ఏమిట‌న్నాలోచ‌న చేస్తే లేనిపోని తిట్లు చాలావ‌ర‌కూ తగ్గుతాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.