Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో మీడియాది అత్యుత్సాహ‌మా?

By:  Tupaki Desk   |   23 July 2017 6:46 AM GMT
డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో మీడియాది అత్యుత్సాహ‌మా?
X
గ‌డిచిన కొద్ది రోజులుగా డ్ర‌గ్స్ రాకెట్ వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఒక ఇష్యూ ఇంత కాలం పాటు కొన‌సాగ‌టం ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మామూలుగానే సెల‌బ్రిటీల వ్య‌వ‌హారం అంటేనే ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు.. క్రైం ఎలిమెంట్ తోడు కావ‌టంతో డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన ప్ర‌తి విష‌యం ఇప్పుడు ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌జల ఆస‌క్తే ప్ర‌ధాన‌వ‌న‌రుగా వ్య‌వ‌హ‌రించే టీవీ న్యూస్ ఛాన‌ళ్ల‌కు.. తాజా డ్ర‌గ్స్ ఎపిసోడ్ ఓ పెద్ద వ‌రంగా మారింద‌ని చెబుతున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్న వైనంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డ్ర‌గ్స్ కేసు ముచ్చ‌ట చూస్తే.. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు టీవీ ఛాన‌ళ్ల‌తో పోలిస్తే.. ప్రింట్ మీడియా కాస్తంత ఆచితూచి వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు సిట్ నోటీసులు ఇవ్వాల‌ని డిసైడ్ చేసి.. వారికి అందించిన విష‌యాన్ని బ్రేక్ చేసింది ఎల‌క్ట్రానిక్ మీడియా అనే చెప్పాలి. ఓప‌క్క టీవీల్లో నోటీసులు జారీ అవుతున్న వారి పేర్లు టెలికాస్ట్ అవుతున్న వేళ‌కు.. త‌మ‌కింకా ఎలాంటి నోటీసులు అంద‌లేద‌న్న విష‌యాన్ని కొంద‌రు ప్ర‌క‌టించ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. నోటీసుల జారీ చేసిన నాటి నుంచి డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన వార్త‌ల జోరు ఛాన‌ళ్ల‌లో మ‌రింత పెరిగాయి. ఇక‌.. సెల‌బ్రిటీల‌ను సిట్ అధికారుల్ని విచారిస్తున్న వేళ‌.. ఈ వ్య‌వ‌హారం మ‌రింత పెరిగింది. మినిట్ టు మినిట్ అన్నంత కాకున్నా.. సిట్ కార్యాల‌యం లోప‌ల ఏం జ‌రుగుతోంది? స‌ద‌రు సెల‌బ్రిటీ ఎదుర్కొంటున్న ప్ర‌శ్న‌లు ఎలా ఉన్నాయి? అవేంటి? వాటికి స‌ద‌రు సెల‌బ్రిటీ రియాక్ష‌న్ ఏమిట‌న్న దానికి సంబంధించిన కొన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారాయి.

నాలుగు గోడ‌ల మ‌ధ్య‌.. సీనియ‌ర్ అధికారులు వేస్తున్న ప్ర‌శ్న‌లు..ఎలా మీడియాకు వ‌చ్చేస్తున్నాయ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఫ‌లానా వారు త‌ప్పు చేసిన‌ట్లుగా మీడియా తేలుస్తూ వార్త‌లు ఇవ్వ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. అధికారికంగా ప్ర‌క‌ట‌న లేకుండానే ఫ‌లానా వారు త‌ప్పు చేసిన‌ట్లుగా మీడియా ఎలా తేలుస్తుంద‌ని వ‌ర్మ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్రైమ్ రిపోర్ట‌ర్ల తీరుపై అవ‌గాహ‌న లేకుండానే సినీ ప్ర‌ముఖులు మాట్లాడుతున్నార‌ని చెబుతున్నారు.

ఈ రోజు సినీ ప్ర‌ముఖుల వ్య‌వ‌హారం వ‌చ్చేస‌రికి అంతా గుట్టుగా సాగాల‌ని భావిస్తున్నార‌ని.. కానీ.. క్రైం రిపోర్టింగ్ చేసే పాత్రికేయులు చాలా షార్ప్ గా ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎక్క‌డేం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని వారు ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించ‌ట‌మే కాదు.. అందుకు త‌గిన వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేసుకొని ఉంటార‌ని చెబుతారు. నిఘా వ్య‌వ‌స్థ‌కు ఎంత‌టి నెట్ వ‌ర్క్ ఉంటుందో.. అంతకాకున్నా.. అలాంటి నెట్ వ‌ర్క్ క్రైం రిపోర్టింగ్ చేసే వారికి ఉంటుంద‌న్న విష‌యం మీడియా వ‌ర్గాల‌కు బాగా తెలిసిందే. అయితే.. ఇలాంటివేమీ త‌మ‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌టంతో సినీ సెల‌బ్రిటీలు ప‌లువురికి ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై వ‌స్తున్న వార్త‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌మ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా వివ‌రాలు బ‌య‌ట‌కురావ‌టంతో సినీ పరిశ్ర‌మ‌కు చెందిన వారు ఉలిక్కి ప‌డుతున్నారే కానీ ఇలాంటివి క్రైం రిపోర్టింగ్ లో చాలా మామూలుగా చెబుతుంటారు. నిజానికి క్రైం రిపోర్ట‌ర్లు ప‌లువురు.. త‌మ‌కు అందుతున్న స‌మాచారాన్ని పోలీసు ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌టం మామూలే. పెద్ద పెద్ద క్రైం సంబంధిత ఉదంతాలు జ‌రిగిన‌ప్పుడు క్రైం రిపోర్ట‌ర్లు విధి నిర్వ‌హ‌ణ ఇదే తీరులో ఉంటుంద‌ని.. దాన్ని త‌ప్పు ప‌ట్ట‌టం సరికాద‌న్న మాట జ‌ర్న‌లిస్ట్ వ‌ర్గాలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. ఎప్పుడూ త‌మ‌ను హీరోలుగా.. గొప్ప‌గా ప‌రిచ‌యం చేసే మీడియా మాత్ర‌మే అల‌వాటున్న సినీ ప్ర‌ముఖుల‌కు.. తాజా ప‌రిణామాలు ఒకింత మింగుడుప‌డ‌ని రీతిలో ఉంటాయ‌న్న మాట ప‌లువురు మీడియాప్ర‌తినిధుల నోట వినిపిస్తోంది.