Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌న‌సు దోచ‌టానికి ఇంత భారీగా వంట‌కాలా?

By:  Tupaki Desk   |   20 April 2019 5:20 AM GMT
కేసీఆర్ మ‌న‌సు దోచ‌టానికి ఇంత భారీగా వంట‌కాలా?
X
అధినేత మ‌న‌సు దోచుకోవ‌టానికి పార్టీ నేత‌లు కిందా మీదా ప‌డ‌టం మామూలే. కానీ.. ప్ర‌భుత్వాధినేత మ‌న‌సు దోచుకోవ‌టానికి వీలుగా.. సీఎం మ‌నసు దోచుకునేలా మీడియా వంట‌లు చేసే కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొద‌టి ట‌ర్మ్ ఎలా పూర్తి అయ్యిందో తెలీకుండా పూర్తి చేసేసిన కేసీఆర్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తానంటూ మాట‌లు చెప్ప‌టం తెలిసిందే.

ప్రాజెక్టులు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేయ‌టం.. ఆయ‌న ఎజెండాలో మార్చాల్సిన అంశాలు చాలానే ఉండ‌టం.. అన్నింటికి సెంట‌ర్ పాయింట్ గా ఉన్న అవినీతి అన్న‌ది తెలంగాణ‌లో లేకుండా చేస్తానంటూ చెబుతున్న కేసీఆర్.. అందుకు త‌గ్గ‌ట్లు అడుగులు వేసే ప్ర‌య‌త్నం షురూ చేశారు. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాన్ని ఎన్ని యాంగిల్స్ లో చెప్పొచ్చొ.. అన్ని ర‌కాలుగా చెప్పే కేసీఆర్‌.. తాజాగా రెవెన్యూశాఖ ప్ర‌క్షాళ‌న‌కు కంక‌ణం క‌ట్టుకున్న‌ది తెలిసిందే.

ఇప్ప‌టివ‌రకూ మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌ని రీతిలో రెవెన్యూ వ‌ర్గాల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడా అంశాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఒకసారి డిసైడ్ అయ్యాక మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గ‌న‌ట్లుగా మాట్లాడే కేసీఆర్ మ‌న‌సు మార్చ‌టానికి రెవెన్యూ ఉద్యోగులు ఆఖ‌రి అస్త్రంగా చిన‌జీయ‌ర్ స్వామిని క‌ల‌వ‌టం.. ఆయ‌న అభ‌యం తీసుకోవ‌టం చేశారు.

ఏ మూడ్ లో ఉన్నారో కానీ.. మీకు స‌మ‌స్య‌లు రావ‌న్న మాట‌ను చిన‌జీయ‌ర్ స్వామి నోటి నుంచి చెప్ప‌నైతే చెప్పించుకున్నారు కానీ.. త‌న‌ను మాత్రం మార్చ‌లేర‌న్న విష‌యాన్ని త‌ర్వాత రెండు రోజుల్లోనే కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌తో స్ప‌ష్ట‌మైన ప‌రిస్థితి. ఎన్నిక‌ల ఫ‌లితాలు బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే రెవెన్యూ ప్ర‌క్షాళ‌న అనే పెద్ద ప్రోగ్రాంకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ య‌మా సీరియ‌స్ గా జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు ఇందుకు బ‌లాన్ని ఇచ్చేలా ఉన్నాయి. రెవెన్యూ ఉద్యోగుల‌తో పెట్టుకోవ‌టం అంత చిన్న విష‌యం కాదు. అయితే.. ఈ ఎపిసోడ్ మొత్తంలో కేసీఆర్ కు ద‌న్నుగా నిల‌వాల్సింది ప్ర‌జ‌లే. ఈ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్.. అందుకు త‌గ్గ‌ట్లు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న సొంత మీడియాలో రెవెన్యూ శాఖ‌లో చేయాల్సిన మార్పులు.. సంస్క‌ర‌ణ‌లు.. ప్ర‌క్షాళ‌న‌తో పాటు.. అవినీతి ఎంత‌గా రాజ్య‌మేలుతుందో అన్న విష‌యంతో పాటు.. వీటి కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందిని వారికి అర్థ‌మ‌య్యేలా ఇప్ప‌టికే చెప్పేశారు.

త‌న సొంత మీడియాకున్న ప‌రిమితులు తెలియ‌ని అమాయ‌కుడేం కాదు కేసీఆర్. అందుకే.. త‌న మీడియాతో చెప్పిన విష‌యాల్నే కాస్త మార్చి మ‌రింత ఎఫెక్టివ్ గా చెప్పే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. దీనికి త‌గ్గ‌ట్లే కొన్ని ప్ర‌ముఖ మీడియాల‌లో రెవెన్యూ శాఖ ప్ర‌క్షాళ‌న అవ‌స‌రాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పే క‌థ‌నాలు ప్ర‌ముఖంగా రావ‌టం మొద‌ల‌య్యాయి. లోపాల్ని ఎత్తి చూపిస్తూ.. జ‌ర‌గాల్సిన ప‌ని ఏమిట‌న్న విష‌యాన్ని హైలెట్ చేస్తున్నాయి.

ఈ ఎపిసోడ్ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ మ‌న‌సు హ‌ర్ట్ అయ్యేలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పేరున్న ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ సైతం.. గులాబీ బాస్ కు న‌చ్చిన‌ట్లుగా వంట‌కాల్ని ఏ రోజుకు ఆ రోజు వండి వ‌డ్డిస్తున్న తీరు అటు మీడియా స‌ర్కిల్స్ లోనూ.. ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఏ మాట‌కు ఆ మాట ఒక‌రిద్ద‌రు త‌ప్పించి.. మిగిలిన వారంతా కేసీఆర్ కు న‌చ్చిన వంట‌కాల్ని చేసేందుకు ప‌డుతున్న ఆరాటం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.