Begin typing your search above and press return to search.

బాబు మీటింగ్‌ కు ఇద్ద‌రు ముఖ్యుల ఆబ్సెంట్‌

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:40 PM GMT
బాబు మీటింగ్‌ కు ఇద్ద‌రు ముఖ్యుల ఆబ్సెంట్‌
X
2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటులో భాగంగా బీజేపీయేతర పక్షాలు సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి శ్రీ‌కారం చుట్టారు. అయితే, ఇదంతా త‌న క్రెడిట్ అని ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ సంగ‌తి పక్క‌న‌ పెడితే - ఈ స‌మావేశానికి ఇద్ద‌రు ముఖ్య నేత‌లు గైర్హాజ‌రు అవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఏపీ సీఎం చంద్రబాబు - నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - ఆర్‌ ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ - డీఎంకే చీఫ్ స్టాలిన్ - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ - జేడీఎస్‌ కు చెందిన దేవెగౌడ హాజరయ్యారు. మ‌హాకూట‌మికి ముఖ్య నేత‌ల్లో ఇద్ద‌రు ఈ భేటీకి గైర్హాజ‌రు అయ్యారు. యూపీ మాజీ సీఎం బహుజ‌న్ స‌మాజ్‌ వాదీ పార్టీ నాయ‌కురాలు మాయావతి - స‌మాజ్‌ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు. మొత్తం 21 పార్టీల నేతలు సమావేశానికి హాజరవగా... ముఖ్య నేత‌లు డుమ్మా కొట్ట‌డం సంచ‌ల‌న‌గా మారింది. అయితే మ‌రో ఇద్దరు నేత‌లు హార‌య్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ - సోమవారమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్‌ వాహా సమావేశానికి హాజరవడం గమనార్హం. చాన్నాళ్లుగా కాంగ్రెస్‌ తో కేజ్రీవాల్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల సమావేశానికి ఆయన కూడా హాజరు కావడం చర్చనీయాంశమైంది.

కాగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఎదుర్కొవాలంటే లోక్‌ సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన అత్యధిక లోక్‌ సభ స్థానాలు ఉన్న యూపీలో విపక్షాల సాధించే స్థానాలు కీలకం కానున్నాయి. కానీ అక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న బీఎస్పీ - ఎస్పీలు నేడు జరిగిన సమావేశానికి దూరంగా జరగడంతో.. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ కొంతమేర ఓటు బ్యాంక్‌ కలిగి ఉంది. తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పెద్ద సంఖ్య‌లోనే అభ్య‌ర్థులు పోటీ చేశారు.