కొత్త ఏటీఎంల కార్డులతో ఇక సమస్య ఉండదు

Fri Apr 21 2017 13:19:03 GMT+0530 (IST)

ఏటీఎం కార్డుతో అనేక సౌలభ్యాలున్నప్పటికీ సమస్యలు కూడా వినియోగదార్లను ఇబ్బంది పెడుతుంటాయి. ఏటీఎం పిన్ నంబర్ ను మర్చిపోవటం కార్డు పోయిన సందర్భాల్లో దొరికినవాళ్లు దుర్వినియోగం చేయటం కార్డును క్లోనింగ్ చేసి నకిలీ కార్డును సృష్టించటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు తెర దించేలా అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ కంపెనీ కొత్తరకం బయోమెట్రిక్ కార్డును తీసుకొచ్చింది.

ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీతో బయోమెట్రిక్ కార్డును ఈ కంపెనీ తయారుచేసింది. వినియోగదారుడికి కార్డును అందజేయటానికి ముందే సదరు వ్యక్తి వేలిముద్రను తీసుకొని కార్డు మీద ఆ సమాచారాన్ని డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ కార్డుతో వినియోగదారుడు షాపింగ్ చేసినప్పుడు.. వేలిముద్రను కార్డు రీడింగ్ యంత్రంలో నమోదు చేస్తే సరిపోతుంది. పిన్ నంబర్ ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బయోమెట్రిక్ కార్డును ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. ఈ బయోమెట్రిక్‌కార్డును సొంతదారుకాకుండా ఇతరులు దుర్వినియోగపరిచే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు. బయోమెట్రిక్ కార్డు వినియోగంపై దక్షిణాఫ్రికాలో రెండుప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఈ ఏడాది చివరకు ఈ కార్డును విస్తృతంగా వినియోగంలోకి తీసుకొస్తామని మాస్టర్ కార్డు ఎంటర్ ప్రైజ్ రిస్క్ - సెక్యూరిటీ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భంగా తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/