Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ మ‌సీదులో కాల్పులు.. 40మంది మృతి!

By:  Tupaki Desk   |   15 March 2019 5:07 AM GMT
న్యూజిలాండ్ మ‌సీదులో కాల్పులు.. 40మంది మృతి!
X
ప్ర‌శాంత‌త‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా.. గొడ‌వ‌లు..హింస‌కు దూరంగా ఉంటుంద‌న్న పేరున్న న్యూజిలాండ్ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ప్ర‌పంచం మొత్తం న్యూజిలాండ్ వైపు చూసేలా చేసింది. క్రిస్ట్ చ‌ర్చ్ న‌గ‌రంలోని ఒక మ‌సీదులో గుర్తు తెలియ‌ని ఆగంతుకుడు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 40మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన‌ట్లు - 20 మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రో ప్రాంతంలో కూడా ఇలాంటి కాల్పుల ఉదంత‌మే చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. న్యూజిలాండ్ కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం దుండ‌గులు మ‌సీదులోకి ప్ర‌వేశిస్తూనే తుపాకీతో విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పుల‌కు దిగిన‌ట్లుగా స్థానికులు.. ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు.

క్రిస్ట్ చ‌ర్చ్ లోని మ‌సీదులో దాదాపు 200 మంది ఉంటార‌ని.. మ‌సీదు వెనుక భాగం నుంచి దుండ‌గులు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. చాలాసేపు కాల్పులు జ‌రిపిన‌ట్లుగా మోతలు వినిపంచాయ‌ని.. అక్క‌డి వారంతా ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున‌నారు. కాల్పుల ఉదంతంలో మ‌సీదులో ఉన్న కొంద‌రు గోడ దూకి పారిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

మ‌సీదులో కాల్పులు మొద‌లు కాగానే.. అక్క‌డి అద్దాలు ప‌గ‌ల‌కొట్టి కొంద‌రు ప్రాణాలు ద‌క్కించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం కాల్పుల ఉదంతంలో 40 మంది చ‌నిపోయిన్న‌ట్లుగా చెబుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లం మొత్తం బీభ‌త్సంగా త‌యారైన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు వెల్ల‌డిస్తున్నారు. కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ప‌లువురిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాల్పుల‌కు తెగ‌బ‌డిన వ్య‌క్తిపై భ‌ద్ర‌తా సిబ్బంది ఎదురుకాల్పులు జ‌రుపుతున్నారు.

న‌గ‌రంలోని ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దంటూ పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న దాడితో భ‌యానికి గురైన ప్ర‌జ‌లు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు. ఇదిలా ఉంటే.. టెస్ట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టుతో మూడో టెస్ట్ అడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు దాడి స‌మ‌యంలో అదే ప్రాంతంలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

అదృష్ట‌వ‌శాత్తు ఈ దాడి నుంచి వారు త‌ప్పించుకున్నార‌ని చెబుతున్నారు. తాము త‌ప్పించుకున్న‌ట్లుగా బంగ్లా క్రికెట‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు. దాడి నుంచి మొత్తం జ‌ట్టు త‌ప్పించుకొంద‌ని.. ఇది భ‌యంక‌ర‌మైన అనుభ‌వంగా అత‌డు పేర్కొన్నారు. అంద‌రి ఆశీస్సులు త‌మ‌ను కాపాడిన‌ట్లుగా ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు. కాల్పుల‌కు కార‌ణం తెలియ‌రాలేదు.